ఇటివల భారీగా ఉద్యోగాలు తొలగిస్తున్న దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది బెంగళూరులో ప్రారంభించిన ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫాంను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు ఎటువంటి కారణం వెల్లడించకపోవడం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. కరోనా సమయంలో ఆన్ లైన్ లెర్నింగ్ కు డిమాండ్ పెరగడంతో ఈ ప్లాట్ ఫాంను ప్రారంభించింది. భారత్ లోని హైస్కూల్ విద్యార్ధుల కోసం దీనిని తీసుకొచ్చింది. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తోంది.
అయితే.. కరోనా తీవ్రత తగ్గడంత దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు యధావిధిగా నడుస్తున్నాయి. దీంతో ఆన్ లైన్ విద్యకు అవకాశం లేకపోయింది. అన్ని అంశాలు పరిశీలించే మూసివేత నిర్ణయానికి వచ్చామని కంపెనీ తెలిపింది. అయితే.. ఇప్పటికే వినియోగదారులు ఉండటంతో విడతలవారీగా మూసివేతను అమలు చేస్తామని తెలిపింది. ఇప్పటికే అమెజాన్ 10వేల మంది ఉద్యోగులను తొలగించింది. వచ్చే ఏడాది కూడా ఈ తొలగింపు ఉంటుందని తెలిపింది. ఇటివలే బైజూస్ కూడా 2500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.