పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తీస్తున్న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ కొడుతుందని నిర్మాత ఎ.ఎం. రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తోంది కాబట్టి.. ప్రేక్షకులకు, పవన్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ తెలిపారు. ఫిబ్రవరి 4న ఆయన బర్త్ డే సందర్భంగా మూవీ గురించి మాట్లాడారు. ఆయన నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ భాగం పూర్తి అయింది. మొన్ననే ఓ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మూవీ నుంచి.
పవన్ కల్యాణ్ తో ఎఎం రత్నంకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ఖుషి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దాని తర్వాత బంగారం సినిమా వచ్చింది. ఆ మూవీ పవన్ ఫ్యాన్స్ కు సంతృప్తి పరిచింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రాబోతోంది. దీన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో ఇదే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ. ఆయన చివరగా బ్రో సినిమాలో నటించారు.
హరిహర వీరమల్లు భారీ బడ్జెట్ తో వస్తోంది. పైగా పీరియాడికల్ మూవీ కావడంతో అంచనాలు మామూలుగా లేవు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న మొదటి మూవీ కూడా ఇదే. ఏఎం రత్నం గతంలో నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు కూడా అందుకున్నారు. మెగా బడ్జెట్ సినిమాల నిర్మాతగా పేరున్న ఆయనకు.. ఈ మూవీ కమ్ బ్యాక్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు.