పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు చెప్పింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలో సోమవారం అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి చినుకులు పడతాయని పేర్కొంది. ఆదివారం విజయనగరంలోని శృంగవరపుకోట లో అత్యధికంగా 79.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
అల్పపీడన ప్రభావం తెలంగాణ పైనా పడనుంది. అదిలాబాద్, ఆసిఫాబాద్ మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.