మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారు, విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. అల్లూరి జయంతి వేడుకలు అలాగే, ఆజాదీ కా అమృత మహోత్సవ వేడుకలు.. ఇవన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని మరో లెవల్‌కి తీసుకెళుతున్నాయి.
ప్రధాని హాజరయ్యే కార్యక్రమం గనుక, ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకీ ఆహ్వానం పంపారుగానీ, ఆయన తరఫున మాజీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమానికి వెళతారట.
మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది. ఆయనా ఈ కార్యక్రమానికి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా నాణానికి ఓ వైపు.
గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆకాశమంత ఎత్తున నిర్మించారుగానీ, ఆ స్థాయిలో అల్లూరికి ఎందుకు గౌరవం ఇవ్వడంలేదు.? అంటూ ఇంకో వైపు కొత్తగా ఆసక్తికరమైన ప్రశ్న ఒకటి తెరపైకొచ్చింది. అది కూడా ఓ టీడీపీ నేత నుంచి రావడం గమనార్హం.
ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఈ ప్రశ్న పుట్టుకొచ్చింది. సదరు టీడీపీ నేతగారి మనోభావాలు దెబ్బతిన్నాయట. దానిపై సహజంగానే వైసీపీ, బీజేపీ ఎదురుదాడికి దిగాయనుకోండి.. అది వేరే సంగతి.
నిజమే, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిందే. కానీ, చేసేదెవరు.? పోలవరం ప్రాజెక్టు పక్కనే ఆకాశమంత ఎత్తున వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టేస్తామని వైసీపీ సర్కారు గతంలో ప్రకటించేసుకుంది. వైఎస్సార్ మీదున్న ప్రేమలో పదో వంతు.. కాదు కాదు, వందో వంతు.. అదీ కాదు, వెయ్యోవంతు కూడా వైసీపీకి అల్లూరి మీద వుండదు. ఎందుకు.? అంటే, అదంతే.
వల్లభాయ్ పటేల్ విగ్రహం వెనుక ఓట్ల రాజకీయం వుంది. వైఎస్సార్ విగ్రహం వెనుక కూడా ఓట్ల రాజకీయమే వుంటుంది. ఆఖరికి అంబేద్కర్ విగ్రహం పేరుతో కూడా ఓట్ల రాజకీయం చేయొచ్చు.
కానీ, అల్లూరి సీతారామరాజు విగ్రహంతో రాజకీయం చేయడానికి కుదరదు కదా.! అద్గదీ అసలు సంగతి.