Tollywood: సినిమా.. భారతీయులకు ఎంతో ఇషమైంది. ముఖ్యంగా దక్షిణాది వారికి. అందులో తెలుగు ప్రేక్షకులే వేరు. ఈమాటని దేశంలోని అనేక చిత్ర పరిశ్రమ ప్రముఖులు చెప్పిన మాట. తెలుగు ప్రేక్షకులకు సినిమా ఒక ఎమోషన్. పలు భాషల్లో డబ్ అయి వచ్చే కలెక్షన్లు ఒక్క తెలుగు సినిమా తెలుగులోనే రిలీజై అవే వసూళ్లు సాధించిన సందర్భాలు ఎన్నో. డబ్బింగ్ సినిమా నచ్చితే.. హీరో ఎవరు, ఏ భాష సినిమ అని కాదు చూస్తారు. ఇంతటి సినిమా ప్రేమికులను ప్రస్తుతం వేధిస్తోన్న సమస్య ధరలు. టికెట్ రేట్లు ఇష్టారీతిన పెంచేయడం.. ఇంటర్వెల్ ఖర్చులు సామాన్యులను సినిమాకు దూరం చేస్తున్నాయనేది వాస్తవం. దీంతో ఓటీటీ బలపడుతోంది.. డిస్ట్రిబ్యూషన్, ధియేటర్లు నష్టపోతున్నాయి.
దీనిపై ఇటివలే ‘బడ్డీ’ సినిమా ప్రమోషన్లో అల్లు శిరీష్ చక్కగా చెప్పారు. ‘హిందీ మాట్లాడేవాళ్లు 90కోట్లు ఉన్నా.. ధియేటర్లకు వచ్చేవారు దాదాపు 3కోట్లే. మన తెలుగు మాట్లాడేవాళ్లు 10కోట్లు ఉంటే.. ధియేటర్లకు వచ్చేవాళ్లూ 3కోట్లే. ఇంతటి అభిమానాన్ని మనమే బాతు-బంగారు గుడ్లు తరహాలో చేసుకుంటున్నాం. టెకెట్ల ధరలు పెంచేసి వచ్చే వసూళ్ల కంటే.. టికెట్ ధరలు తగ్గించి ధియేటర్లకు జనాన్ని రప్పించి మరింత ఎక్కువ వసూళ్లు తెచ్చుకోవచ్చు. దీంతో పరిశ్రమ ధియేటర్లూ బతుకుతాయ’ని చెప్పిన మాట నూరుపాళ్లు నిజం. నలుగురు కుటుంబసభ్యులు సినిమాకి వెళ్తే రూ.1500-2000 వరకూ అయ్యే పరిస్థితి. సింగిల్ స్క్కీన్ లో కొంత తగ్గినా సినిమా మాత్రం ప్రియం అయిపోయింది.
వందల కోట్లలో ఖర్చు చేశాం కాబట్టి ధరలు పెంచుకుంటున్నామంటూ ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకునీ మరీ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో మొదటి వారం అభిమానులు, సినీ ప్రేమికులు వచ్చినా.. రెండో వారం ధరలు తగ్గాక వచ్చేవారికంటే బద్దకించేవారు ఎక్కువ ఉన్నారు. ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనుకుంటూ. ఇది ఓటీటీకి లాభం. సినిమాపై ఆధారపడ్డ ధియేటర్లు, సిబ్బందికి నష్టం. ఇప్పటికే ఎన్నో ధియేటర్లు కల్యాణమంటపాలయ్యాయి. పెద్ద సినిమా వస్తేనే ధియేటర్లు తెరుస్తామని మూసినవీ ఉన్నాయి. ఓటీటీ తమను దెబ్బతీస్తుందనే వారు, టికెట్ రేట్లపై కూడా ఆలోచించాలి. సమస్య ఎవరికీ తెలీదని కాదు, కొన్ని గళం విప్పితేనే తెలుస్తాయి. ఇక పరిశ్రమ ఇష్టం..!