Aay: నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన సినిమా ‘ఆయ్’ (Aay). GA2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా అంజి కె.మణిపుత్ర దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. హైదరాబాద్ లో జరిగిన సినిమా థీమ్ సాంగ్ విడుదల కార్యక్రమంలో
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఆయ్’ టైటిల్ ఓ ప్రాంతానికే పరిమితమైంది కాదు. వర్షం కోసమే కోటిపైగా ఖర్చు పెట్టారు. నిజంగానే వర్షంలో తడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నితిన్ చక్కగా నటించారు. సినిమా ప్రేక్షకులకి నచ్చుతుంద’ని అన్నారు.
నార్నే నితిన్.. ‘మంచి గోదావరి సినిమా తీశాం. మంచి ఫ్రెండ్ షిప్ గురించి చెప్పాం. డైరక్టర్ అంజి కథ చెబుతుంటేనే సినిమా కనిపించింది. నవ్వుతూనే ఉన్నాను. ఆడియెన్స్ కూడా నవ్వుతూనే ఉంటారని ఆశిస్తున్న’నని అన్నారు.
బన్నీ వాస్.. ‘కష్టం, ఒత్తిడిలో ఉన్నా ఒక జోక్ రిలీఫ్ ఇస్తుంది. ఆయ్ సినిమా కూడా అంతే. నవ్వి నవ్వి బుగ్గలు నొప్పెడతాయి. మీమర్స్‌కు మంచి కంటెంట్ దొరుకుతుంది. నితిన్, అంకిత్, కసిరాజు అద్భుతంగా నటించార’ని అన్నారు.
దర్శకుడు అంజి కె.మణిపుత్ర.. ‘గోదావరి ప్రాంతం వేదికగా వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ చిత్రం అవుతుంది. నితిన్ నార్నే అక్కడి యాసలానే మాట్లాడాడు. అమ్మాయి తడిసినా, ఊరు తడిసినా అందంగా ఉంటుంది. ఆయ్ కూడా అంతే’నని అన్నారు.