Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి వారం టికెట్ల రేట్లు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నైజాం ఏరియాలో ఈ సినిమా టికెట్ల రేట్లకు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియర్ షో టికెట్ల రేట్లు రూ.1000 కి పైగా పెట్టడంపై ఇప్పటికే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిలు మాట్లాడుతూ ఉన్న సమయంలో ఫ్యాన్స్ నుంచి కొందరు టికెట్ల రేట్లు మరీ రూ.1200లు అయితే ఎట్టా సర్ అంటూ అరిచారు. ఆ మాటలు వినిపించినా నిర్మాతలు మాత్రం స్పందించలేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ జేబులకు చిల్లు పెట్టే విధంగా ఏంటి ఈ పని అంటూ చాలా మంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం అంటూ చెప్పే అల్లు అర్జున్ టికెట్ల రేట్ల విషయంలో నిర్మాతలతో మాట్లాడవచ్చు కదా అంటూ అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాలు ఇంత భారీగా టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వడం విడ్డూరంగా ఉందని, ముందు ముందు వచ్చే సినిమాలకు సైతం ఇదే స్థాయిలో టికెట్ల రేట్లు పెంచితే థియేటర్‌కి వచ్చే వారు మరింతగా తగ్గుతారు అంటూ సినీ విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు.