Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం థ్యాంక్స్ మీట్ ఘనంగా జరిగింది. వేడుకలో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ షీల్డులు బహుకరించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ
‘పుష్పను ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. పోస్టర్‌లో నా ఫోటో చూసుకున్న ప్రతిసారీ.. నాపై టీమ్ చూపిన ప్రేమే కనిపించింది. 5నిముషాల నుంచి షూటింగ్ జరిగిన 5ఏళ్ల వరకూ టీమ్ ఎంతో కష్టపడ్డారు. పుష్ప-2 షూటింగ్ అయిపోయిందంటే ఎమోషనల్ అయ్యాను. నిర్మాతలు రవి, నవీన్, చెర్రీ వల్లే పుష్ప సాధ్యమైంది. మిలియన్ వ్యూస్ లో పాటలుండాలని భావిస్తే దేవిశ్రీప్రసాద్ బిలియన్స్‌ల్లో చూపించాడు. అంత ఎనర్జీ ఇచ్చాడు’.
పుష్పలో నా నటనకు ఎంతో పేరు రావడానికి కారణం సుకుమారే. సుకుమార్ సీన్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. పుష్ప ఓ ఎమోషన్. ఐదు ఏళ్లు సుకుమార్ ఏది చెబితే అది చేశాం. అందరికి జీవితాంతం గుర్తుండిపోతుంది. పుష్ప-3 ఏంటో తెలియదు కానీ ఓ అద్బుతంలా కనిపిస్తుంది. అందరికి హిట్ ఇచ్చేది దర్శకుడే. సుకుమార్ కు థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట. సుకుమార్ మాత్రం సినిమా విజయంలో అందరికి క్రెడిట్ ఇస్తాడు. సినిమా సక్సెస్‌ను నా అభిమానులకు అంకితం చేస్తున్నా’నని అన్నారు.
సుకుమార్ .. ‘పుష్ప విజయంలో మైత్రీ మూవీస్ చెర్రీ పాత్ర కీలకమైంది. ఆయన సలహాతోనే పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కించా. రంగస్థలం నుంచి వరుస హిట్స్ రావడానికి మైత్రీ మూవీసే కారణం. ఈ విజయం వాళ్లదే. దేవి లేకుండా ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా సినిమా చేయలేను. నాపేరు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ నాకు ఎంతో ఎనర్జీ ఇస్తాడు. ఆయనో అద్బుతం. నా దగ్గర సరైన కథ లేకుండానే ఓకే చెప్పాడు. పుష్ప సక్సెస్ క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్‌దే. నేషనల్ అవార్డ్ విన్నర్ గా తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఒకాయన అల్లు అర్జున్‌ను నటనలో ఎస్వీ రంగారావుతో పోల్చారంటే అర్ధం చేసుకోవచ్చ’ని అన్నారు.
నిర్మాత రవిశంకర్, నవీన్ మాట్లాడుతూ ”పుష్ప-2 సుకుమార్ విజన్ నుంచి వచ్చిన సక్సెస్ ఇది. అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు పూర్తి బలాన్నిచ్చారు. అంచనాలు మంచి కలెక్ట్ చేస్తుందని ఊహించినా.. ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని ఊహించలేదు. ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు హీరో, దర్శకుడికి థాంక్స్’ అని అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్..’ పుష్ప అనేది ఓ మ్యాజిక్. ఎన్ని మాటలు చెప్పినా చాలవు. ఈ మ్యాజిక్ కు కారణమైన హీరో, దర్శకుడు, మైత్రీ మూవీ అధినేతలకు కృతజ్ఞతలు. కష్టపడితే యూనివర్శ్ మనకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుందనేందుకు పుష్ప సక్సెస్ నిదర్శనం. సుకుమార్ గారి విజన్ కు అల్లు అర్జున్ ప్రాణం పోశార’ని అన్నారు.