Allu Arjun: సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టయి జైలుకెళ్లిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ మేరకు ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తెలంగాణ హైకోర్టు ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు.
అయితే… హైకోర్టు నుంచి జైలు అధికారులకు బెయిల్ పత్రాలు ఆలస్యంగా అందాయి. శుక్రవారం రాత్రికి పత్రాలు అందడం.. తదనంతర ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండటంతో శుక్రవారం రాత్రంతా ఆయన జైలులోనే ఉన్నారు. అల్లు అర్జున్ న్యాయవాదులు రూ.50వేలు పూచీకత్తును జైలు సూపరిండెంట్ కు అందించారు. దీంతో శనివారం ఉదయం చంచల్ గూడ జైలు వెనుక గేటు నుంచి ఎస్కార్ట్ వాహనం ద్వారా అల్లు అర్జున్ ను పోలీసులు విడుదల చేశారు. తొలుత ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లనున్నారు. పోలీసులు భారీ భద్రత కల్పించారు.