Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 1 భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది. అంతే కాకుండా దేవిశ్రీ ప్రసాద్‌కి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది. ఇప్పుడు పుష్ప 2 అంతకు మించి అంటూ టాక్ వస్తోంది.
పుష్ప పార్ట్ 1తో పోల్చితే పార్ట్ 2లో అల్లు అర్జున్ నటన రెండు మూడు రెట్లు అధికంగా ఉందని, సినిమా మొత్తం ఆయన నటన ప్రత్యేక ఆకర్షణ కావడంతో పాటు సినిమాకు ఆయనే హైలైట్‌గా నిలిచారనే టాక్ వినిపిస్తుంది. రివ్యూలు కూడా అదే విధంగా వస్తున్నాయి. పుష్ప 2 లో అల్లు అర్జున్ నటనకు కచ్చితంగా మళ్లీ జాతీయ అవార్డు దక్కడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌తో పాటు రివ్యూవర్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
దర్శకుడు సుకుమార్ పుష్ప పార్ట్ 1లో తన మార్క్‌ను చూపించారు, కానీ పుష్ప 2 లో మాత్రం పూర్తి ఆధిపత్యం అల్లు అర్జున్ దే అంటూ చాలా మంది అంటున్నారు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ పడ్డ కష్టం, చేసిన సాహసాలు సినిమాను వెండి తెరపై చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. జాతర సన్నివేశాలతో పాటు, కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాల్లో అల్లు అర్జున్ నటనకి మాటలు లేవు అన్నట్లుగా ఉంది.
మొదటి పార్ట్‌లోని నటనకే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అంతకు మించి నటన ఉండటంతో జాతీయ అవార్డు రాకుండా ఎలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇన్నాళ్ల తెలుగు సినిమా చరిత్రలో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ అవార్డును తెచ్చి పెట్టాడు. మళ్లీ ఆయనే టాలీవుడ్‌కి రెండో జాతీయ అవార్డును తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.