Allu Arjun: వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో మరో స్టార్ హీరో కోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ ను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోరుతూ సివిల్ సూట్ పిటిషన్ దాఖలు చేయడం వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్ తరఫున న్యాయవాది స్వాతి సుకుమార్ కోర్టులో ఆయన తరపున వాదనలు వినిపిస్తూ.. ‘ కొన్ని సంస్థలు, వ్యక్తులు ఆయనకు సంబంధం లేకుండా అల్లు అర్జున్ ఇమేజ్ ను వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫొటోలు క్రియేట్ చేస్తున్నారు.
వాయిస్ క్లోన్ చేసి అచ్చం ఆయనలా మాట్లాడే యాప్ లను సృష్టిస్తున్నారు. ఇటువంటి చర్యలు అడ్డుకోవాలి. ఇది తన బ్రాండ్ వాల్యూకు నష్ట’మని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అల్లు అర్జున్ కు అనుకూలంగా ఆర్డర్ ఇస్తామని పేర్కొంది. అనుమతి లేకుండా సెలబ్రిటీల హోదా, వ్యక్తిత్వాన్ని వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం తప్ప’ని అభిప్రాయపడింది. అయితే.. తదుపరి విచారణలో దీనిపై స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశముంది. మొత్తంగా అల్లు అర్జున్ కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టులో తీర్పు వచ్చినట్టయింది. ఇటివలి కాలంలో డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు, వాయిస్ మార్ఫింగ్ ఎక్కువయింది. దీంతో సెలబ్రిటీల ఇమేజ్ కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
దీంతో ఇప్పటికే అనేకమయంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత హక్కులు కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా వారందరికీ అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. ఇప్పుడు వీరి లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరారు. కోర్టును ఆశ్రయించినవారిలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజినీకాంత్, మోహన్ లాల్, ఐశ్వర్యారాయ్, నాగార్జున, పవన్ కళ్యాణ్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, శిల్పాశెట్టి వంటి స్టార్ నటీనటులు ఉన్నారు. కెరీర్ పరంగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’లో అల్లు అర్జున్ నటిస్తున్నారు. అంతర్జాతీయ ప్రాజెక్టుగా సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు అల్లు అర్జున్.
