ఏ మెగాస్టార్ చిరంజీవి అండతో సినీ నటుడిగా కెరీర్ మొదలు పెట్టాడో, ఆ మెగాస్టార్ చిరంజీవిని తన అభిమానులు అవమానిస్తోంటే, అల్లు అర్జున్ ఎందుకు ఉపేక్షిస్తునట్లు.? అల్లు అర్జున్‌కి అసలంటూ స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఇచ్చిందే మెగాస్టార్ చిరంజీవి.
మెగా అభిమానుల్లో ఒకాయన, అల్లు అర్జున్ మీద ‘చెప్పను బ్రదర్’ వివాదంపై విమర్శలు చేసిన మాట వాస్తవం. ఆ విమర్శలకు చింతిస్తున్నట్లు అదే అభిమాని ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నదీ నిజం. ఇదే విషయంలో ఆ అభిమాన లీడర్ పై.. చిరంజీవి, రాంచరణ్ లు కూడా కోపగించుకున్నట్టు తెలిసింది..మరి వెనుక ఇంత జరిగాక కూడా అక్కడితో వివాదాన్ని వదిలేయాల్సిన అల్లు అర్జున్ అభిమానులు, ‘అల్లు అర్జున్‌కి మెగాస్టార్ చిరంజీవి దారి చూపడం కాదు.. మెగాస్టార్ చిరంజీవికే అల్లు అర్జున్ తాతయ్య అల్లు రామలింగయ్య సినీ రంగంలో దారి చూపారు..’ అంటూ రివర్స్ ఎటాక్ తీవ్రస్థాయిలో చేస్తున్నారు.
‘మేం అల్లు అర్జున్ సైనికులం.. మా అభిమాన హీరోకి రక్షణగా నిలుస్తాం.. చిరంజీవినైనా లెక్కచేయం. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మాకు లెక్క కాదు..’ అంటూ అల్లు అర్జున్ అభిమానులు విర్రవీగుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
‘అల వైకుంఠపురములో’, ‘పుష్ప’ చిత్రాల విజయంతో అల్లు అర్జున్ తన అభిమానుల్ని ఇలా మెగా కాంపౌండ్ మీదకు ఉసిగొల్పుతున్నాడా.? అన్న అనుమానాలకు తావిచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేప్పొద్దున్న అల్లు అర్జున్‌కి ఓ పెద్ద డిజాస్టర్ వస్తే, అప్పుడు ఆ అల్లు అర్జున్‌కి బాసటగా నిలవాల్సింది మెగా కుటుంబమే, మెగా అభిమానులే.!
ఈ మొత్తం వ్యవహారంలో పుల్ల పెడుతున్నది నందమూరి అభిమానులు అని అనుకోవడం మరో ఆసక్తికరమైన వ్యవహారం. ఆ నందమూరి అభిమానులు, మహేష్ బాబు అభిమానులు కలిసి అల్లు అర్జున్ అభిమానులు మెగా కాంపౌండ్ మీద చెలరేగిపోతున్నారు. మరి, ఈ వివాదంపై అల్లు అర్జున్ నుంచి ఏదైనా బాధ్యతాయుత ప్రకటన రావాలి కదా.. మరి అల్లు అర్జున్ స్పందించడా..
స్పందించకుండా ఊరికే చూస్తూ ఉంటే మాత్రం.. తానే చేయిస్తున్నట్లుగా మెగా అభిమానులు అర్థం చేసుకుంటారు మరి. ఈ రెండు కుటుంబాల మధ్య ఫాన్స్ పేరుతో నడుస్తోన్న రచ్చ ఇరువురికీ వాంఛనీయం కాదు.. మెగా ఫామిలీ నుంచి ఈపాటికే ఇలాంటివి చేయవద్దని సంకేతం ఇచ్చారు కాబట్టి.. ఇక అల్లు అర్జున్ తన వంతు పాత్ర ఖచ్చితంగా నిర్వహించాల్సిన సమయం ఇది..