ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన జీవిత చరిత్రను వెబ్ సిరీస్ గా కానీ సినిమాగా కానీ ఎప్పటికైనా తెరమీదకి తీసుకురావాలని కోరుకుంటున్నాట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. శాకాహారి అయిన రామ్మూర్తి నాయుడు తన దేహదారుద్యంతో ఎన్నో అద్భుతాలు సృష్టించారని కొనియాడారు. శ్రీకాకుళం లోని కోడి రామ్మూర్తి స్టేడియం లో జరిగిన “తండేల్” సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారుల జీవితాలను “తండేల్” రూపంలో తెరపై ఆవిష్కరించాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతి అయిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి జీవితాన్ని కూడా తెరకెక్కిస్తాం. వెబ్ సిరీస్ గా గాని సినిమాగా కానీ రూపొందిస్తాం. ఇప్పటికే దీనిపై కొంత స్టడీ కూడా చేశాం” అని అల్లు అరవింద్ తెలిపారు. అయితే కోడి రామ్మూర్తి బయోపిక్ పై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఈయన బయోపిక్ లో నటించనున్నట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా రామ్మూర్తి నాయుడు బయోపిక్ ప్రస్తావన తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎవరీ రామ్మూర్తి నాయుడు?
శ్రీకాకుళంలోని వీరఘట్టం లో జన్మించిన కోడి రామ్మూర్తి నాయుడు 20 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మల్ల యోధుడు. మల్ల విద్యలో ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఏనుగుని తన చాతిపై ఎక్కించుకుని ఐదు నిమిషాల పాటు నిలిపారు. రైలు ఇంజన్ ను ఒంటి చేత్తో ఆపి అప్పట్లో సంచలనంగా మారారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ పాలకులైన కింగ్ జార్జ్, మేరీ క్వీన్ లో ఆయన బల ప్రదర్శనకు అబ్బురపడి “ఇండియన్ హెర్క్యులస్” అనే బిరుదు తో ఆయనను సత్కరించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను కలియుగ భీముడుగా అభివర్ణించేవారు.