2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది ఈవీఎంలతోనే.! 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది కూడా ఈవీఎంలతోనే. గెలిచినప్పుడు తమ ఘనత, ఓటమి పాపం మాత్రం ఈవీఎంల ఖాతాలో.. అన్నట్లుగా వ్యవహరిస్తోంది వైసీపీ.
సరే, ఓటమి భయం అలాగే వుంటుంది. బకాయింపులు మామూలే.! కానీ, ఎన్ని రోజులు.? ఎన్ని నెలలు.? ‘ఈవీఎం సీఎం, ఈవీఎం ప్రభుత్వం..’ అంటూ పదే పదే పసలేని ఆరోపణలు చేస్తూ వస్తోంది వైసీపీ. ఇది ప్రజల్లో వైసీపీని మరింత పలచన చేస్తోంది.
ప్రజా తీర్పుని గౌరవించలేకపోవడం అనేది ఓ రోగం.. అని ప్రజలే అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ ఎంత గింజుకున్నా రిజల్ట్ అనేది మారదు.! ఐదేళ్ళపాటు కూటమి పార్టీలు అధికారంలో వుంటాయి. టీడీపీ, జనసేన, బీజేపీ బంధం ఇప్పట్లో తెగిపోయేలా కనిపించడంలేదు.
2019 ఎన్నికల తర్వాత ఈవీఎంలపై టీడీపీ కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. కానీ, అది కొంత కాలమే. ఈవీఎంలపై ఆరోపణలు తప్పు కాదు.. కానీ, అదే ఆరోపణలు పదే పదే చేస్తూ, అదే రాజకీయం అనుకునే భ్రమల్లో కొట్టు మిట్టాడితేనే వైసీపీకి అది చాలా చాలా నష్టం.
క్యాడర్ కూడా ఈవీఎం ఆరోపణల్ని అసహ్యించుకుంటున్నాయన్న విషయాన్ని వైసీపీ అధినాయకత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. పైగా, వైసీపీ అధికారంలో వున్నప్పుడే బ్యాలెట్ విధానం ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే, వైసీపీకి ‘గుండు సున్నా’ వచ్చింది అప్పట్లో.
‘బ్యాలెట్‌తో జరిగి వుంటే, ఈ పదకొండు సీట్లు కూడా వచ్చి వుండేవి కాదు. ఆ పదకొండూ గెలిచామంటే, అది ఈవీఎంల వల్లనే.. మనదే ఈవీఎం గెలుపు..’ అని వైసీపీలో కొందరు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత హోదా అడగడం కాదు.. ముందంటూ ప్రజల్లో వుండాలన్నది వైసీపీ కార్యకర్తల డిమాండ్. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న దరిమిలా, కూటమి పాలనలోని వైపల్యాల్ని పద్ధతిగా ఎత్తి చూపగలిగితే ప్రయోజనం వుంటుందని వైసీపీ క్యాడర్ తమ అధినాయకత్వానికి సూచిస్తోంది.
కానీ, ఇదేదీ పట్టడంలేదు వైసీపీ అధినాయకత్వానికి. ఈవీఎంలపై ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నా, వైసీపీ తీరు మారడంలేదు. ఈవీఎంలను ఎంతలా తప్పు పడితే, అది వైసీపీకి అంత పెద్ద నష్టాన్ని తెచ్చి పెడుతుంది రాజకీయంగా.
ఎందుకంటే, ముందు ముందు ఏ ఎన్నిక జరిగినా అదీ ఈవీఎం ద్వారానే జరుగుతుంది తప్ప, బ్యాలెట్ విధానంలో జరగదు. అది వైసీపీ అధినాయకత్వానికి కూడా బాగా తెలుసు. 2029 ఎన్నికలూ ఈవీఎం పద్ధతిలోనే జరుగుతాయ్. అప్పుడు గెలవాలంటే, ఇప్పుడు ఈవీఎంల మీద ఆరోపణలు చేయడం వైసీపీ మానుకోవాలి.
లేదూ, ఈవీఎంల మీద ఆరోపణలకే పరిమితమవ్వాలని వైసీపీ అధినాయకత్వం అనుకుంటే, 2029 ఎన్నికల వరకూ వైసీపీ మనుగడ సాధించే అవకాశం వుండదు. ఈలోగానే పార్టీ జెండా పీకేసుకోవాల్సిందే.