ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గిందిట.! అదే సమయంలో మద్యం మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం పెరిగిందట.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అనిపిస్తోందా.? అయితే, అది మీ తప్పు కానే కాదు.!
చెప్పిందేంటి.? చేస్తున్నదేంటి.? రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేస్తామని ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే విషయాన్ని ప్రస్తావించారు. దశలవారీగా మద్య నియంత్రణ.. ఐదేళ్ళలో పూర్తిగా మద్య నిషేధం.. ఇదీ వైఎస్ జగన్ ఇచ్చిన మాట. అంతేనా, మద్య నిషేధం చేయకపోతే, తర్వాతి ఎన్నికల్లో ఓట్లు అడగబోం.. అని కూడా వైఎస్ జగన్ చెప్పారు. వైసీపీలో చాలామంది నేతలూ అదే మాట కుండబద్దలుగొట్టేశారు.
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు.. అనేది జస్ట్ సినిమాటిక్ డైలాగ్. కానీ, అన్నిటా మాట తప్పుడే.. మడమ తిప్పుడే.! మద్యం విషయానికొస్తే, షాక్ కొట్టించేలా మద్యం ధరలన్నారు.. అంతలోనే, మద్యం ధరల్ని తగ్గించేశారు. ఈ క్రమంలో చెత్త బ్రాండ్ల మద్యం కూడా తెరపైకొచ్చింది.
ఇంతా చేసి, ఇప్పుడేమో మద్యం వినియోగం తగ్గిందనీ, మద్యం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరిగిందని ప్రభుత్వం అంటోంది. అదెలా అధ్యక్షా.? అనే డౌట్ మీకొస్తే.. అది మీ తప్పు కానే కాదు. కుక్కను చూపించి అది కుక్క కాదు నక్క.. అంటే, ఔను అది ‘నక్క’ అనాల్సిందే.. అని తీరాల్సిందే.!
ఆంధ్రప్రదేశ్‌లో ఆ చివర నుంచి ఈ చివరదాకా.. మద్యం సేవించేవారి సంఖ్య తగ్గిందా.? పెరిగిందా.? అన్న ప్రశ్నకు సమాధానం సింపుల్.. ‘పెరిగింది’ అనే సమాధానమే వస్తుంది మరి.!. కానీ, మద్యం వినియోగం తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది. మంచి బ్రాండ్ల మద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు సరిహద్దుల్లో వున్నవారు. పొరుగు రాష్ట్రాల్లోని మద్యం దుకాణాల వద్ద.. ఏపీకి చెందిన మందుబాబులే అత్యధికులు కనిపిస్తున్నారు మరి.!
ఏం జరుగుతోంది.? ఏం చెబుతున్నాం.? అన్నదానిపై కనీస ఇంగితం కూడా లేకుండా అధికార వైసీపీ, అడ్డగోలు ప్రచారాలు చేస్తోంది.. మద్యం విషయంలో. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు డాష్ డాష్.. అని ఊరకనే అన్నారా.?
తూచ్, అసలు రాష్ట్రంలో మద్యం సేవించేవారే లేరు.. అయినా ఖజానా నిండిపోతోందని రేప్పొద్దున్న వైసీపీ నేతలు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. అలా తయారైంది వైసీపీ వ్యవహారం.