పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం ఇప్పటిది కాదు.! చాలాకాలంగా జరుగుతున్నదే. ‘ఓజీ’ సినిమాలో అకిరా నందన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడన్న గుసగుసలు వినిపిస్తున్నా, ఈ విషయమై ఎలాంటి స్పష్టతా రావడంలేదు.
ఇదిలా వుంటే, అకిరా నందన్ తెరంగేట్రానికి సంబంధించి తెరవెనుక ఏర్పాట్లు అప్పుడే షురూ అయ్యాయంటూ కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు, పవన్ కళ్యాణ్‌తో ఇప్పటికే సంప్రదింపులు జరిపాయనీ, పవన్ కళ్యాణ్ కూడా అకిరా నందన్ తెరంగేట్రం పట్ల సానుకూలంగానే వున్నారనీ అంటున్నారనీ తెలుస్తోంది.
హీరోగా అకిరా నందన్‌ని లాంఛ్ చేయడానికి, మెగా కాంపౌండ్‌లోనే నిర్మాణ సంస్థలున్నాయ్. రామ్ చరణ్ సొంత బ్యానర్, నాగబాబు నిర్మాతగా ఓ బ్యానర్, నిహారిక, సుస్మిత.. ఇలా పలు బ్యానర్లున్నాయ్ అన్నంది అందరికీ తెలిసిన విషయమే.
వాస్తవానికి, అకిరా నందన్ తెరంగేట్రం బాధ్యతని రామ్ చరణ్ తీసుకున్నాడంటూ కొన్నాళ్ళ క్రితమే ప్రచారం జరిగింది. ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో అకిరా నందన్ తెరంగేట్రం గురించిన ప్రస్తావన వస్తే, ‘త్వరలో’ అని సమాధానమిచ్చాడు రామ్ చరణ్.
ఇంకోపక్క పవన్ కళ్యాణ్‌కి కూడా సొంతగా ఓ నిర్మాణ సంస్థ వుంది. కానీ, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, నటుడిగా తాను పూర్తి చేయాల్సిన సినిమాల విషయంలోనే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. సో, పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్‌లో అకిరా నటించడం దాదాపు అసాధ్యమే.
అకిరా నందన్ కోసం త్రివిక్రమ్ లాంటి ప్రముఖ దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే వుంటారనుకోండి.. అది వేరే చర్చ. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ ఏడాదే అకిరానందన్ తెరంగేట్రంపై అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.
తన తండ్రి పవన్ కళ్యాణ్ వెంట, దక్షిణ భారతదేశంలోని పలు ప్రముఖ దేవాలయాల్ని అకిరా నందన్ సందర్శిస్తున్న దరిమిలా, అకిరా నందన్ తెరంగేట్రం గురించి బోల్డంత చర్చ నడుస్తోంది. వీలైనంత త్వరగా అకిరా నందన్‌ని హీరోగా లాంఛ్ చేసెయ్యమంటూ పవన్ కళ్యాణ్‌పై అభిమానుల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది.