నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2కి సంబంధించిన రిలీజ్ డ్రామా చివరకు కీలక మలుపు తీసుకుంది. మద్రాస్ హైకోర్టు రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకున్నట్లు తెలిసింది. ఈరోస్ సంస్థతో ఉన్న ఆర్థిక విభేదాల కారణంగా డిసెంబర్ 5న జరగాల్సిన గ్రాండ్ రిలీజ్ ఒక్కసారిగా రద్దు కావడంతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అఖండ 2 రిలీజ్ అనూహ్యంగా వాయిదాపడటంతో మొత్తం ప్లానింగ్ గందరగోళంలో పడింది.
ఇక సమస్యను పరిష్కరించేందుకు 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ గత కొన్ని రోజులు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. చర్చలు, ఒప్పందాలు, న్యాయపరమైన ప్రక్రియలన్నీ పూర్తి కావడంతో కోర్టు ఇక రిలీజ్‌కు అడ్డంకులేదని స్పష్టంచేయడంతో .. డిసెంబర్ 12నే సినిమాను విడుదల చేసేందుకు టీమ్ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అభిమానుల డిమాండ్ కూడా అదే దిశగా ఉంది.
అయితే రిలీజ్‌కు మార్గం సిద్ధమైనా కొత్త సమస్య ఓవర్సీస్ మార్కెట్లో తలెత్తింది. మొదట రిలీజ్ ప్లాన్ చేసిన తేదీ వాయిదాపడటంతో అక్కడి థియేటర్ లిస్టింగ్స్ మొత్తం రద్దయ్యాయి. ఇప్పుడు కొత్త తేదీ ప్రకారం కేవలం రెండు రోజుల్లోనే మళ్లీ స్క్రీన్లు బుక్ చేసుకోవాలి. ఇది డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద కష్టంగా మారింది. ఓవర్సీస్ షోలు సమయానికి మొదలవుతాయా అన్న అనుమానం ఇంకా కొనసాగుతూనే ఉంది.
దేశంలో అయితే రిలీజ్ అనుకున్నట్టుగానే జరగేందుకు అడ్డంకులు లేవన్నట్లే. టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మళ్లీ అప్లికేషన్లు సమర్పించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్‌లు పెట్టే యోచన కూడా ఉంది. మొత్తం మీద అఖండ 2 చివరికి ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే నమ్మకం బలపడింది కానీ ఓవర్సీస్ మార్కెట్‌లో ఇంకా పజిల్ అదే ఉంది.
