Plane crash: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీ విమాన ప్రమాదం జరిగింది. గురువారం లండన్ బయల్దేరిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.
విమానం కూలినచోట దట్టమైన పొగ అన్ని వైపులకు వ్యాపించింది. సుదూర ప్రయాణం కావడంతో ఇంధనం కూడా నిండుగా ఉండటం ప్రమాద తీవ్రత పెరగటానికి కారణమైందని తెలుస్తోంది. మధ్యాహ్నం 1.39 సమయంలో చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం. 300 మంది వరకూ ప్రయాణించవచ్చు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఆ విమానంలో ప్రయాణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రమాదంపై ప్రధాని మోదీ అరా తీశారు. విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి బయలుదేరారు. మరోవైపు.. హోమ్ శాఖమంత్రి అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో మాట్లాడారు. ప్రమాదం తీవృతనుబట్టి మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
