YSRCP: మొదటి నుంచీ అందరూ మొత్తుకుంటున్నదే. గతంలోనూ సలహాదారులున్నా, అత్యంత దారుణంగా, అత్యంత అభ్యంతరకరంగా మారింది వైసీపీ హయాంలో ‘సలహాదారుల’ వ్యవస్థ.! ఎడా పెడా సలహాదారుల్ని వైసీపీ సర్కారు నియమిస్తూ వెళుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఏంటసలు.? చెప్పుకుంటూ పోతే, చాలామంది సలహాదారుల విషయంలో జనం విస్తుపోయారు.
రాజకీయ నిరుద్యోగులకు పునరావాస్ కేంద్రంగా ఈ సలహాదారుల వ్యవస్థను వైసీపీ పెంచి పోషిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానాల్లో పిర్యాదులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఓ కేసు విచారణ సందర్భంగా, ‘తహసీల్దారులకి కూడా సలహాదారుల్ని నియమిస్తారేమో.. అంటూ ఉన్నత న్యాయస్థానం ఆక్షేపణలు చేసింది.
‘సలహాదారుల వ్యవస్థ తాలూకు చట్టబద్ధతను తేలుస్తాం..’ అని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పేసరికి, వైసీపీ సర్కారు షరామామూలుగానే ‘చేతులు కాలాక ఆకులు పట్టుకునే’ ప్రయత్నం చేసింది. సలహాదారుల నియామకానికి సంబంధించి విధి విధానాల్ని ఖారారు చేసి, క్యాబినెట్ ఆమోదానికి పంపుతున్నట్లు పేర్కొంది.
ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులుంటారట. సరిపోయింది సంబరం.! మళ్ళీ ఇదో కొత్త పంచాయితీ.! ఐఏఎస్ అధికారులున్నారు కదా.. ఐఫీఎస్ అధికారులున్నారు కదా.! వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులూ వుంటారు కదా.? మళ్ళీ కొత్తగా ఈ సలహాదారుల గోలేంటి.?
ప్రతి మంత్రికీ సలహాదారులు.. ప్రత్యేక సలహాదారులంటూ నియమించుకుంటూ పోతే, అది మళ్ళీ రచ్చకు కారణమయ్యే అవకాశాల్లేకపోలేదు. రికార్డు స్థాయిలో మంత్రులున్నారు.. ఆ విషయంలోనే చాలా విమర్శలున్నాయ్. అసలు ఏ శాఖకి ఎవరు మంత్రో.. జనానికి అర్థం కాని పరిస్థితి.
మంత్రుల సంగతి పక్కన పెడితే, అసలు సలహాదారులు ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు.? సలహాదారులు సరైన సలహాలు ఇస్తే, న్యాయస్థానాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు మొట్టికాయలు ఎందుకు పడతాయ్.?