వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో కోట్ల అవకతవకలపై ACB విచారణకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, ఆరోపణలపై సమగ్ర విచారణ జరగనుంది. ఎన్నికల ముందు ఏపీలోని యువ ఓటర్లను టార్గెట్ చేస్తూ ఆడుదాం ఆంధ్ర కార్యమం నిర్వహించింది వైసీపీ ప్రభుత్వం. 45 రోజుల్లోనే ఈ కార్యక్రమం కోసం 119 కోట్ల రూ.లు ఖర్చు చేసింది.
ఐతే లెక్కకు మాత్రమే 119 కోట్లు కానీ అంతకు మించి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కుంభకోణం జరిగిందని సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 400 కోట్ల రూ.ల దాకా కుంభకోణం జరిగిందని.. ఐతే 119 కోట్లు ఆడుదాం ఆంధ్ర ఖర్చు మాత్రమే కాకుండా జిల్లా ఫండ్స్ కూడా దీనికి ఖర్చు చేశారనే అనుమానాలు ఉన్నాయి.
ఈ స్కామ్‌పై సమగ్ర విచారణ జరపించాలని ఎమ్మెల్యేలు గౌతు శిరీష, భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. వారి విన్నపానికి స్పందించిన ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలపై విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది. ఆడుదాం ఆంధ్రా పేరుతో క్రీడాకారులను అపహాస్యం చేయడమే కాకుండా యువతను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఆడుదాం ఆంధ్రా పేరుతో 45 రోజుల్లో అత్యంత విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న అనుమానాలు ఎమ్మెల్యేలు వెల్లడించారు. దీనిలో మంత్రి రోజాపై అనేక అభియోగాలు ఉన్నాయి. అందుకే మొత్తం వయ్వహారంపై ACB విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ACB రిపోర్ట్ వచ్చాక బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.