బిగ్ బాస్ తెలుగు రియాల్టీ ఎనిమిదో సీజన్‌లో ఓ చిన్న ట్విస్ట్.! అదే ఆదిత్య ఓం ఎలిమినేషన్. ఎప్పుడో ఔట్ అయిపోవాల్సినోడు.. ఇప్పటిదాకా కొనసాగడమే గొప్ప.! హమ్మయ్య.. ఇప్పటికైనా వదిలించుకున్నారు.! ఇదీ బిగ్ బాస్ వ్యూయర్స్ అభిప్రాయం. అయినా, ఏడుపుగొట్టు మణికంఠను వదిలేసి, ఆదిత్య ఓంని బయటకు పంపించేయడమేంటబ్బా.?
ఓటింగ్ ప్యాటర్న్ అలా తగలడిందట. అర్థరాత్రి విష్ణు ప్రియ, నైనికలతోపాటు ఆదిత్య ఓంలను ఎవిక్షన్ గేట్ వద్దకు తీసుకొచ్చిన బిగ్ బాస్, అందులోంచి ఆదిత్య ఓంని పట్టుకుపోయాడు. విష్ణు ప్రియ, నైనిక అయితే షాక్.! ‘అయినా, మేం బయటకు పోవాలిగానీ, అతనెలా పోతాడు.?’ అన్న అయోమయం ఆ ఇద్దరిలో కనిపించింది.
మణికంఠది మరీ చిత్రమైన పరిస్థితి. నన్నెలా భరిస్తున్నావ్ బిగ్ బాస్.? అన్నట్లుగా మణికంఠ మొహం పెట్టాడు. అంతకు ముందు నైనిక అయితే, ‘నేను బట్టలు సర్దుకోను.. ఏం చేసుకుంటావో చేస్కో బిగ్ బాస్’ అనేసింది. ఇంత గౌరవం వుంది కంటెస్టెంట్లకి బిగ్ బాస్ అంటే.
కాగా, ఎలిమినేషన్ కంటే ముందు జరిగిన మెగా చీఫ్ టాస్క్‌లో నబీల్ గెలిచాడు. నబీల్ – పృధ్వీ మధ్య నడిచిన కాంటెస్ట్‌లో నబీల్ విజయం సాధించగా, అది తట్టుకోలేకపోయింది యష్మి కామెడీగా. పృధ్వీ గెలవాలనుకుంది యష్మి. అందులో తప్పు లేదు. కానీ, పృధ్వీ ఓడిపోవడంతో, యష్మి ఏడుపు లంకించుకోవడం భలే కామెడీ అయిపోయింది.
యష్మి ఒక్కసారిగా ఇంత డ్రమెటిక్‌గా ఎలా మారిపోయిందబ్బా.? నటి కదా, సహజంగానే నటించేయొచ్చు.. తనది నటన అని తెలియకుండా మేనేజ్ చేసెయ్యొచ్చు. కానీ, తాను నటిస్తున్న విషయం అందరికీ తెలియాలనీ, తనను అంతా వెర్రి వెంగళప్ప అనుకోవాలనీ.. పనికిమాలిన నటనను యష్మి ప్రదర్శించినట్లుగా మారింది పరిస్థితి.
ఈ ఏడుపు వ్యవహారంతో యష్మి రేంజ్ అమాంతం పాతాళానికి పడిపోయింది. కాగా, మెగా చీఫ్ కాంటెస్ట్ కోసం జరిగిన కంటెండర్ పోటీల్లో చివరి వరకూ వచ్చి, గెలుపు ముందర బోల్తా పడింది ప్రేరణ. ఆమె ఓడిపోవడం మాత్రం, చాలామందికి ఒకింత బాధ కలిగించింది. ప్రేరణ ఔట్ అవడంతో, నబీల్‌కి రేసులో ముందుకెళ్లే అవకాశం లభించింది.
మెగా చీఫ్ టాస్క్‌లో విజయం సాధించడం ద్వారా నబీల్, తన మైలేజ్ పెంచుకున్నాడు. అంటే, హౌస్ మొత్తానికీ, నబీల్ ఇప్పుడు కెప్టెన్ అన్నమాట.
హోస్ట్ అక్కినేని నాగార్జన గత వీకెండ్‌లో చెప్పిన ‘మిడ్ వీక్ ఎలిమినేషన్’ పూర్తయిపోయినట్టే. మరి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ సంగతేంటి.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. వీకెండ్ వచ్చేస్తోంది కూడా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే, ఒక్కరా.? ఇద్దరా.?
ఈ వీకెండ్ ఎలిమినేషన్ యధాతథంగా వుంటుందా.? విష్ణు ప్రియ – నైనికల్లో ఎవరో ఒకరు ఔట్ అయిపోయే అవకాశం వుందా.? ఈ రోజుకి సేవ్ అయిన మణికంఠ పరిస్థితి ఏమవుతుంది.? వేచి చూడాల్సిందే.