ఫిమేల్ యాక్టర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ డాక్టర్ కాంత రాజ్ పై సీనియర్ నటి రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన ఆయన ఇండస్ట్రీలోని ఫిమేల్ యాక్టర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. నటీమణులందరూ వ్యభిచారులే అన్న అర్థం వచ్చేలా మాట్లాడారని, లైట్ మెన్, మేకప్ మెన్, కెమెరామెన్ డైరెక్టర్ ఇలా అందరితో అడ్జస్ట్ చేసుకుంటూ అవకాశాలను పొందుతున్నారని మహిళలను కించపరిచే విధంగా డాక్టర్ కాంతరాజ్ మాట్లాడారని రోహిణి చెప్పారు.
అలాంటి నిరాధార ఆరోపణలు చేసిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, సదరు యూట్యూబ్ ఛానల్ లోని ఆ వీడియోను తొలగించాలంటూ చెన్నై పోలీస్ కమిషనర్ ను ఆమె కోరారు.
మలయాళ సినీ పరిశ్రమలో ఏర్పాటుచేసిన హేమా కమిషన్ తరహాలోనే కోలీవుడ్ లోనూ నడిగర్ సంఘం విశాఖ కమిటీ సిఫార్సుతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించింది. సీనియర్ డాక్టర్ వ్యవహారంతో పాటు మరికొన్ని ఫిర్యాదులు తన వద్దకు వచ్చినట్లు రోహిణి తెలిపారు.