దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం “ఉత్సవం”. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్ బిల్ పిక్చర్స్ పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మూవీ హీరోయిన్ రెజీనా పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
” ఈ సినిమాలో నేను కార్పొరేషన్ ఎంప్లాయ్ గా కనిపిస్తాను. ఇందులో నా పాత్రకి ప్రేమ మీద మంచి ఇంప్రెషన్ ఉండదు. చాలా ఇండిపెండెంట్, ఉమెన్ సెంట్రిక్ రోల్. నా పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉంటుంది. ఇందులో రంగస్థలం నటుల గురించి చాలా బాగా చూపించారు. ఆ సీన్లన్నీ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకునేలా ఉంటాయి. ఈ సినిమాలో నటించిన సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, నాజర్ ఇద్దరు నాటక రంగం నుంచి వచ్చారు. వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మంచి అనుభూతి. సినిమా హీరో దిలీప్ హార్డ్ వర్కర్. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ తో ఉంటారు. తనతో సినిమా చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఇద్దరి పాత్రలు చాలా చక్కగా కుదిరాయి. డైరెక్టర్ అర్జున్ సాయి తన తొలి సినిమాగా ఇలాంటి గొప్ప కథని ప్రేక్షకులకు చెప్పాలనుకున్నారు. దీనికి మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ సపోర్ట్ చేయడం, సినిమాని తెలుగులోనూ విడుదల చేయడం ఆనందంగా ఉంది. అందుకు వారికి ధన్యవాదాలు. ఈ సినిమా వారికి కూడా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను” అని రెజీనా అన్నారు.