డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ సీనియర్ నటి హేమ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. గత నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు. గురువారం ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
ఆమెను అరెస్టు చేసే సమయంలో ఎలాంటి డ్రగ్స్ ఆమె వద్ద లేవని.. ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు టెస్ట్ చేశారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసుల వద్ద కూడా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన హేమ ని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ( మా) సస్పెండ్ చేసింది. ఆమెపై ఆరోపణలు రావటంతో ‘మా’ ప్యానెల్ సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
డ్రగ్స్ కేసు పై వివరణ ఇవ్వాలని హేమకి నోటీసులు జారీ చేసినప్పటికీ వాటికి స్పందించనందున ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఈ కేసులో ఆమెకు క్లీన్ చిట్ లభించే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.