సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి(38) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఆమెకు గుండె నొప్పిగా ఉందని చెప్పింది. దాంతో హుటాహుటిన ఆమెను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె రాత్రి ఒంటిగంట సమయంలో మృతి చెందింది. వైద్యులు ఆమెకు సీఆర్పీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతి చెందడంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రాజేంద్ర ప్రసాద్ కు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అయితే కూతురు గాయత్రి ప్రేమించిన వాడితో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆమె గురించి అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టం లేకుండా తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. అప్పటి నుంచి మాటలు లేవని ఆయన తెలిపారు. ఏ వ్యక్తి అయినా తన కూతురులోనే తన తల్లిని చూసుకుంటాడని.. నా చిన్న తనంలోనే నా తల్లి మరణిస్తే.. నాకు కూతురు పుట్టిన తర్వాత ఆమెలోనే నా తల్లిని చూసుకుంటున్నా అని ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
అయినా సరే చిన్ని చిన్ని తల్లీ అనే పాట వినిపించడానికి నా కూతురును నా ఇంటికి తీసుకొచ్చాను. ఆ పాటను ఆమెకు నాలుగుసార్లు వినిపించాను అంటూ తెలిపారు రాజేంద్ర ప్రసాద్. ఆమె ప్రేమ వివాహం చేసుకున్న కొన్ని రోజులకే రాజేంద్ర ప్రసాద్ ఆమెను స్వాగతించారు. ఇక గాయత్రి కూతురు సాయి తేజస్విని మహానటి చిత్రంలో బాలనటిగా నటించింది.