సినిమా నటుడు పృథ్వీ చేసిన ఒక్క కామెంట్ కు లైలా సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాలంటూ వైసీపీ చేస్తున్న రచ్చకు అసలు అర్థం ఉందా అంటున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే ఒక సినిమాను కోట్లు ఖర్చుపెట్టి తీస్తారు. డైరెక్టర్, హీరో నెలల పాటు కష్టపడి తీసిన సినిమాను ఒక్క వ్యక్తి కారణంగా ఎలా బ్యాన్ చేస్తారంటూ సగటు సినిమా ప్రేక్షకులు మండిపడుతున్నారు.
విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. మేం షూటింగ్ లొకేషన్ ఓ సీన్ కోసం ఉన్నప్పుడు అక్కడ 150 గొర్రెలు ఉన్నాయి.. తర్వాత చూస్తే అక్కడ 11 ఉన్నాయంటూ వైసీపీ మీద సెటైర్ వేశాడు. అంటే వైసీపీకి గతంలో 155 సీట్లు ఉంటే మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయింది అని వచ్చేలా కామెంట్ చేశాడన్నమాట. అయితే పృథ్వీ ఈ కామెంట్స్ చేయడంతో వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమను అవమానించిన లైలా సినిమాను బ్యాన్ చేయాలంటూ వేలాది ట్వీట్స్ వేయిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ చేస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.
కాగా ఇదే విషయంపై అటు విశ్వక్ కూడా స్పందించాడు. పృథ్వీ మాట్లాడిన దానికి తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. పృథ్వీ మాట్లాడింది ఆయన వ్యక్తిగతం అని.. దానికి తమ సినిమాను బ్యాన్ చేయడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ పృథ్వీ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణ కూడా చెప్పాడు విశ్వక్ సేన్.
రిలీజ్ రోజే హెచ్ డీ ప్రింట్ ను విడుదల చేస్తామంటూ బెదిరిస్తున్నారని.. అసలు తాను ఎవరికీ అన్యాయం చేయలేదని ఎమోషనల్ అయ్యాడు విశ్వక్. పృథ్వీ చెప్పినట్టు సినిమాలో అన్ని గొర్రెలు లేవని కూడా క్లారిటీ ఇచ్చాడు. అవును విశ్వక్ సేన్ చెప్పింది కరెక్టే కదా అంటున్నారు సగటు నెటిజన్లు.
ఎందుకంటే పృథ్వీ మాట్లాడింది పూర్తిగా అతని వ్యక్తిగతం. కాబట్టి ఏదైనా ఉంటే అతన్ని అనాలి తప్ప.. సినిమాను నిందించడం కరెక్ట్ కాదు. పైగా వైసీపీ వాళ్లు గతంలో ఏ సినిమాను టార్గెట్ చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా మీద వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎన్ని నెగెటివ్ పోస్టులు పెట్టారో అందరికీ తెలుసని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి గేమ్ ఛేంజర్ సినిమా టైమ్ లో వైసీపీని ఏమీ అనలేదు కదా.. అప్పుడెందుకు అలా టార్గెట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వైసీపీ రాజకీయాలు చేయాలి గానీ.. ఇలా సినిమాలను టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.