Priyadarshi: ‘శంకర్ దర్శకత్వంలో నటించాలనే కోరికైతే తీరింది కానీ.. నిరుత్సాహమే మిగిలింద’న్నారు నటుడు ప్రియదర్శి. రామ్ జగదీశ్ దర్శకత్వంలో నాని నిర్మాతగా తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమా మార్చి 14న విడుదలవుతున్న సందర్భంగా జరిగిన ప్రమోషన్లో ఆయన మాట్లాడారు.
‘శంకర్ సినిమాలో నటించాలనేది నా కోరిక. ఆయన నాతో సినిమా ఎలానూ చేయరు. దీంతో ‘గేమ్ చేంజర్’లో అవకాశం రాగానే చాలా ఆనందించా. బలగం కంటే ముందు ఒప్పుకున్న సినిమా. కానీ.. ప్రకటించింది, తెరకెక్కిచిందీ, పూర్తయిందెప్పుడో అందరికీ తెలిసిందే. అయితే.. సినిమాకు నేను 25రోజులు పని చేశా. కానీ.. సినిమాలో నా పాత్ర 2నిముషాలు కూడా కనిపించదు. శంకర్, రామ్ చరణ్, తిరు వంటి వారితో పని చేసాననే తృప్తి మాత్రమే మిగిలింది’.
‘చిరంజీవిగారితో నటించాలనే కోరిక ఉంది. ఆచార్య, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాల్లో ప్రయత్నించినా అనుకోని కారణాలతో అవకాశం దక్కలేదు. అనిల్ రావిపూడి సినిమాకి ప్రయత్నిస్తా’నని అన్నారు.