కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ఆయన టీమ్ ప్రకటించింది. దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉండే వారికి చేయూతనందించడంలో ప్రభాస్ ఎప్పుడు ముందుంటారంటూ ప్రశంసలు కనిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి అంత మొత్తంలో సాయం అందించిన వ్యక్తి ప్రభాస్ అని నెట్టింట్లోనూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.కోటి సాయం అందించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, నయన తార, విఘ్నేష్ దంపతులు రూ.25 లక్షలు, తమిళ హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, ఆయన తమ్ముడు కార్తీ కలిసి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి రూ.30 లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు, విక్రమ్ రూ. 20 లక్షలు, హీరోయిన్ రష్మిక రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.
మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం ప్రకటించడంతోపాటు లెఫ్టినెంట్ హోదాలో సహాయక చర్యల్లోనూ పాల్గొంటున్నారు. ఇటీవల వయనాడ్ లో కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడటంతో 350 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.