వ్యూస్ కోసం కొంతమంది పెట్టే చీప్ థంబ్ నైల్స్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఎన్ని విధాలుగా ఛీ కొడుతున్నా సరే వాళ్లు మాత్రం ఆ ధోరణి మార్చుకోవడం లేదు. వాళ్లు చేస్తున్న ఈ పనుల వల్ల ఎంతోమంది ఎన్నో విధాలుగా సఫర్ అవుతున్నారు. తాజాగా తెలుగు నటి గాయత్రి భార్గవికి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఒక మీడియా సంస్థ మీద తన అసంతృప్తిని వెల్లడిస్తూ ఒక స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో పెట్టారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే సదరు సంస్థకు గాయత్రి భార్గవి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఎక్కడ పెద్దగా రివీల్ చేయని గాయత్రి భార్గవి ఆ ఇంటర్వ్యూలో తన భర్త ఆర్మీ ఆఫీసర్ అని.. ఒకసారి తన భర్త ఎదుర్కొన్న కొన్ని సవాళ్ల గురించి.. ఆ టైంలో తన ఫ్యామిలీ పడిన స్ట్రగుల్ గురించి చెప్పుకొచ్చారు.
ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది ఒకటైతే వాళ్లు థంబ్ నైల్ లో మరోటి పెట్టారు. ఏకంగా ఆమె భర్త చనిపోయాడు.. ముక్కలు ముక్కలుగా చేసి అంటూ ఘోరాతి ఘోరంగా రాసుకొచ్చారు. బ్రతికున్న భర్త గురించి మీడియా సంస్థ కేవలం కొన్ని వ్యూస్ కోసం ఇలాంటి నీచానికి దిగడం పట్ల గాయత్రి భార్గవి ఫైర్ అయ్యారు. దేశానికి సేవ చేస్తున్న ఆర్మీ ఆఫీసర్ కి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆమె అన్నారు
సదరు మీడియా సంస్థకు ఇదివరకు ఒకటి రెండు సందర్భాల్లో చెప్పినా సరే సరిచేసుకోలేదని. ఆ మీడియా సంస్థ తనకు వివరణ ఇవ్వాలని గాయత్రి భార్గవి అన్నారు. అంతేకాదు ఆ మీడియా సంస్థ చేసిన పనికి తన భర్త విక్రం కు గాయత్రి భార్గవి క్షమాపణలు చెప్పారు.
మిస్ గైడ్ థంబ్ నైల్స్, లోపల మ్యాటర్ ఒకటైతే పైన థంబ్ నైల్ ఒకటి పెట్టి వ్యూస్ సంపాదించడం మీడియా సంస్థలకు అలవాటుగా మారింది. దీని మీద ఎంతమంది ఎన్ని విధాలుగా ఎటాక్ చేసినా వాళ్ల పద్ధతి మాత్రం మార్పు రావడం లేదు. మరీ గొడవ పెద్దైతే ఆ వీడియో డిలీట్ చేస్తారేమో కానీ అలాంటి థంబ్ నైల్స్ వల్ల ఆ ఫ్యామిలీ పడే మానసిక బాధని ఎవరు గ్రహించలేరు.
మీడియా సంస్థలు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఇలా మిస్ గైడ్ థంబ్ నైల్స్ పెట్టి ప్రేక్షకులను మోసం చేయడమే కాకుండా వారి వ్యూస్ కోసం సెలబ్రిటీలకు భంగపాటు కలిగేలా చేస్తున్నారు. ఇలాంటివి ఆగాలంటే ముందు ఇలాంటి రాంగ్, మిస్ గైడ్ థంబ్ నైల్ సంస్థలను జనాలు తిప్పికొట్టాలి. వాళ్లపై తగిన విధంగా యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఇలాంటివి మళ్లీ మళ్లీ చేస్తున్నారు.
ఒక ఫ్యామిలీ బాధపడేలా వ్యక్తిగత హననం చేయడం ఎవరికి హక్కు లేదు. కచ్చితంగా దీనిపై సీరియస్ యాక్షన్ ఉంటేనే మళ్లీ మరోసారి ఇలాంటి మిస్ గైడ్ ఇన్ఫర్మేషన్ ని జనాల మీదే రుద్దే ప్రయత్నం చేయరు.
గాయత్రి భార్గవి తీసుకున్న ఈ ఇన్షియేషన్ వల్ల కచ్చితంగా మీడియా సంస్థలు వారి వ్యూస్ కోసం పెడుతున్న మిస్ గైడ్ థంబ్ నైల్స్, అవాస్తవాలను ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది.