అమెరికాలో ముగ్గురు తెలుగు వారు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఫ్లోరిడాలో కార్ యాక్సిడెంట్ జరగ్గా.. ఇందులో ముగ్గురు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకుల పల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, పవిత్రాదేవి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కూతురు ప్రగతిరెడ్డిని సిద్దిపేటకు దగ్గర్లోని బక్రి చెప్యాలకు చెందిన రోహిత్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. రోహిత్ రెడ్డి వృత్తి రీత్యా అమెరికాలోనే ఉంటున్నాడు. అతనితో పాటే తల్లి సునీత, భార్య ప్రగతి రెడ్డి, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అయితే వీరంతా కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది.
ఇండియా టైమ్ ప్రకారం సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం జరగ్గా.. ప్రగతిరెడ్డి(35), పెద్ద కొడుకు అర్విన్(6), సునీత(56) అక్కడికక్కడే మరణించారు. రోహిత్ రెడ్డి, చిన్న కొడుకు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ విషయం తెలియడంతో ఇటు రోహిత్ రెడ్డి స్వగ్రామం బక్రి చెప్యాలలో, అటు ప్రగతిరెడ్డి గ్రామం టేకులపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రోహిత్ రెడ్డి కారు సరిగ్గా నడపలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో ప్రగతిరెడ్డి తల్లిదండ్రులు మోహన్‌రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయల్దేరారు.