‘అర్థం పర్థం లేని ఆరోపణలతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ఏం సాధించగలరు.? న్యాయం నా వైపే వుంది. అది ప్రభుత్వంలో వున్నవారికీ తెలుసు. ఓడిపోతామని తెలిసి కూడా ప్రజా ధనాన్ని అనవసరంగా పెద్ద పెద్ద లాయర్ల మీద ఖర్చు చేస్తున్నారు..’ అంటూ ఆ మధ్య సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.!
ఏబీవీ చెప్పినట్లే, సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఏపీ సర్కారు వాదన వీగిపోయింది. ఏబీ వెంకటేశ్వరరావుకి తిరిగి పోస్టింగ్ దక్కింది. కాదు కాదు, విధిలేని పరిస్థితుల్లో ఏపీ సర్కారు పోస్టింగ్ ఇచ్చింది. కానీ, మళ్ళీ తనకున్న విచక్షణాధికారం పేరుతో ఏబీ వెంకటేశ్వరరావుపై కొద్ది రోజుల్లోనే సస్పెన్షన్ వేటు వేసింది ఏపీ సర్కారు.
కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి కోర్టును ఆశ్రయిస్తారన్నది నిర్వివాదాంశం. ఆ తర్వాత ఏమవుతుందన్నది, ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాల్ని విశ్లేషిస్తే తేలిగ్గానే అర్థమయిపోతుంది. కానీ, ఈ మొత్తం వ్యవహారంతో ఏపీ సర్కారు సాధించేదేంటి.? ప్రజా ధనం దుర్వినియోగమవడం తప్ప.?
అసలు ఇలాంటి కేసుల్లో వైసీపీ సర్కారు ఏ మేరకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది.? అన్నదానిపై లెక్కలు తేలాల్సి వుంది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం చేసే ఖర్చు కారణంగా ప్రజా ధనం దుర్వినియోగమవుతోందన్న ఆక్షేపణలు ఓ పక్క వ్యక్తమవుతోంటే, ఇంకోపక్క.. ఇలాంటి అర్థం పర్థం లేని కేసులతో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేయడమేంటి.? అన్న ప్రశ్న సామాన్యుల్నీ ఆలోచనలో పడేస్తోంది.
ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేస్తే, ఆయనకు శిక్ష పడాల్సిందే. కానీ, మూడేళ్ళుగా కొండను తవ్వి ఎలకను సైతం పట్టలేని చందంగా.. ఆయన మీద సస్పెన్షన్ వేటు తప్ప.. ఆయన తప్పు చేశారని నిరూపించలేకపోయింది వైఎస్ జగన్ సర్కారు.