పెద్దలు ఓ మాట చెబుతుంటారు.. ‘పోయినోళ్ళంతా మంచోళ్ళే’ అని.! అలాగని, పోయినోళ్ళంతా మంచోళ్ళే అవ్వాలనే రూల్ ఏమీ లేదు. కాకపోతే, ‘పోయారు’ కదా, వాళ్ళ గురించి ‘మంచి’ మాట్లాడుకోవడం బెటర్.! వాళ్ళు చేసిన ‘చెడు’ గురించి మాట్లాడటం దండగ.! ఇదీ, ‘పోయినోళ్ళంతా మంచోళ్ళే’ అన్నదానికి అసలు అర్థం.
మీడియా మొఘల్ రామోజీరావు మృతి నేపథ్యంలో, తెలుగు మీడియాలో ఓ సెక్షన్ విపరీతమైన ‘బిరుదుల్ని’ ఆయనకు అంటించేసింది. ‘అక్షర సూరీడు’ అనీ, ఇంకోటనీ.. ఏవేవో విపరీతమైన పొగడ్తలతో, కుప్పలు తెప్పలుగా బిరుదులతో.. రామోజీరావుకి ఘన నివాళి అర్పించేసింది సోకాల్డ్ మీడియా.!
అసలు రామోజీరావు నిజంగానే అంత మంచివాడా.? ‘రామోజీ’ వెనకున్న అక్రమాల సంగతేంటి.? ఈనాడు దినపత్రిక దగ్గర్నుంచి, పచ్చళ్ళ వ్యాపారం వరకు.. మార్గదర్శి నుంచి ఫిలిం సిటీ వరకు.. ‘రామోజీ’ సంస్థలన్నీ వివాదాల్ని ఎదుర్కొన్నాయి.. ఆ వివాదాలు కొనసాగుతూనే వున్నాయి.
‘నిప్పు లేకుండానే పొగ పుడుతుందా.?’ అని రామోజీ, తన ‘ఈనాడు’ ద్వారా ఎన్నో గాలి వార్తల్ని పోగేసిన మాట వాస్తవం. అలాంటప్పుడు, రామోజీరావు మీడియా రంగంలో అంత ‘ఉత్తముడు’ ఎలా అవుతారు.? ఇక, తెలుగు భాషకి రామోజీరావు చేసిన సేవ అంతా ఇంతా కాదు.. అన్న పొగడ్త ఒకటి.! ఔనా, అంత సేవ చేసేశారా.?
తెలుగు అక్షరాల్లో కొన్ని, వ్యవహారికం నుంచి మాయమైపోవడానికి ‘ఈనాడు’ కూడా ఓ కారణం. ఇంగ్లీషు పదాల్ని తెలుగీకరించే క్రమంలో కొత్త కొత్త పదాల్ని ఈనాడు సృష్టించింది. అదే క్రమంలో చాలా తెలుగు అక్షరాల్ని అడ్డగోలుగా వాడేసింది. ‘తెలుగు సరిగ్గా రావాలంటే, ఈనాడు చదవాలి’ అనే భావనని జనంలోకి బలంగా ఎక్కించేశారు. కానీ, అది వాస్తవం కాదు.
ప్రస్తుతం వున్న తెలుగు మీడియాలో, ‘ఈనాడు’ కాస్త బెటర్ అంతే. కానీ, ‘ఈనాడు’ మాత్రమే, తెలుగు భాషని కాపాడిందని అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. రామోజీరావు పుణ్యమా అని, చాలామందికి ఉపాధి దొరికిందన్నమాట వాస్తవం. ఈనాడు గ్రూపు సంస్థల ద్వారా వేల మందికి, లక్షల మందికి ఉపాధి దొరికింది.
వందలాది, వేలాది మంది జర్నలిస్టులు ‘ఈనాడు’ ద్వారా పాత్రికేయ రంగంలోకి వచ్చారు. అలా వచ్చినవారే, ‘శ్రమ దోపిడీ’ అంటూ, ‘ఈనాడు’ మీద ఆరోపణలు చేయడం చూశాం. రామోజీరావు చేసింది ‘సేవ’ కాదు, వ్యాపారం.. అన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్. వ్యాపారం మాత్రమే కాదు, లాభసాటి వ్యాపారం చేశారు రామోజీరావు.
ఈ క్రమంలో ఎన్నో మీడియా సంస్థల్ని, ఎందరో ప్రముఖుల్ని తొక్కేయడంలో రామోజీ పాత్ర అంతా ఇంతా కాదు. ప్రజారాజ్యం పార్టీని కూకటివేళ్ళతో పెకలించేయడానికి రామోజీరావు చేసిన అక్షర యుద్ధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మీడియా అంటే, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. కానీ, ఈనాడు అంటే, టీడీపీ అను‘కుల’ మీడియాలో అగ్రస్థానం పొందిన సంస్థ.
చెప్పుకుంటూ పోతే కథ చాలా పెద్దది. చాలా చాలా పెద్దది.! దాసరి నారాయణరావు నేతృత్వంలో పుట్టిన ‘ఉదయం’ ఎలా అంతరించిపోయింది.? అని ఆనాటి పాత్రికేయులు ఎవర్నయినా అడగండి, ‘రామోజీరావు పుణ్యమే’ అని కుండబద్దలుగొట్టి మరీ చెబుతారు.
దాసరి నారాయణరావు పేరునిగానీ, ఫొటోనిగానీ, ‘ఈనాడు’లో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డ రామోజీరావు, చాలాకాలం విధించిన ఆ నిషేధం నుంచి ఆ తర్వాత వెసులుబాటు కల్పించారనుకోండి.. అది వేరే సంగతి. రాసుకుంటూ పోతే, ఒకటి కాదు పది కాదు, పాతిక కాదు.. వందల సంఖ్యలో ఇలాంటివి కనిపిస్తాయ్.
‘మార్గదర్శి’ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అదో పెద్ద కథ. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయ్. రామోజీ చేసిన ఈ అక్రమ వ్యాపారం గురించి వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన రాజకీయ పోరాటం అందరికీ తెలిసిందే. కేవలం రాజకీయ విమర్శలు కావవి, అంతకు మించి.! మరణంతో రామోజీరావుకి ఆ కేసుల నుంచి విముక్తి లభిస్తుందనుకోండి.. అది వేరే సంగతి.
పచ్చళ్ళు, అప్పడాలు, చిట్టీలు, సినిమాలు, పత్రిక – న్యూస్ చానళ్ళు, ఫిలిం సిటీ.. వాట్ నాట్.. అన్నిటి మీదా వివాదాలే. తన ఫిలిం సిటీ ప్రాభవం కోసం ఓ ఊరిని బాధపెట్టిన రామోజీపై అప్పట్లో కేసులు నడిచాయ్. కాలక్రమంలో ఆ కేసులేమయ్యాయో ఎవరికీ తెలియదు.
టీడీపీ ‘రాజగురువు’ రామోజీ, ఎన్ని రాజకీయ బంధాల్ని తెగ్గొట్టారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ అవసరాల కోసం కలపడం, అదే టీడీపీ అవసరాల కోసం విడదీయడం.. ఇవన్నీ రామోజీ మార్కు రాజకీయాలు.! అందుగలడిందులేడని సందేహము వలదు.. అన్నట్టుగా, అన్నిటిలోనూ ‘రామోజీ’ వుండేవారు.! ఇప్పుడిక లేరు.!