A.R.Rahman: ఏ.ఆర్.రెహమాన్ వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో.. కొన్నాళ్లు ఆయన కెరీర్ కు విరామం ఇస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఇకపై ఆయన సంగీతాన్ని మిస్ కావాల్సిందేనా..? అంటూ రెహమాన్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు. దీనిపై రెహమాన్ కుమార్తె ఖతీజా స్పందించారు.
‘రెహమాన్ గారి విషయంలో ఎన్ని వార్తలు ఖండిస్తున్నా కొత్తగా అవాస్తవాలు పుట్టుకొస్తున్నాయి. వార్తల్లో నిజంలేదని చెప్తున్నా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దయచేసి అసత్ ప్రచారాలను వ్యాపింపచేయొద్దు. వార్తల్లో ఎటువంటి నిజమూ లేద’ని ఇన్ స్టా వేదికగా ఆ వార్తను ప్రచురితం చేసిన మీడియా లింక్ ను కోట్ చేస్తూ తెలిపారు. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెహమాన్ తన భార్య సైరాభానుతో విడిపోతున్నట్టు ప్రకటించినప్పటి నుంచీ ఆయనపై రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని ఆయన కుమారుడు, కుమార్తె ఖండిస్తున్నారు. కెరీర్ పరంగా రెహమాన్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.