అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో భారీ ఊరట లభించింది. సంధ్య థియేటర్ కేసులో ప్రస్తుతం ఆయన రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటూ బెయిల్ ఇచ్చిన సందర్భంగా నాంపల్లి కోర్టు ఆదేశించింది. కాగా ఇప్పుడు ఇదే విషయంలో అల్లు అర్జున్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. తన భద్రతా సమస్యల దృష్ట్యా ప్రతి ఆదివారం చిక్కడపల్లికి పోలీస్ స్టేషన్ కు వెళ్లడంపై మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టును కోరారు. ఆయన తరఫున లాయర్ల వాదనలు విన్న కోర్టు ఆ మేరకు మినహాయింపు ఇచ్చింది. అలాగే విదేశాలకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
దీంతో అల్లు అర్జున్ కు రిలీఫ్ దక్కింది. సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ చాలా కాలంగా సఫర్ అవుతున్నారు. ఇప్పటికే ఓ సారి జైలుకు వెళ్లి వచ్చిన ఆయన పోలీస్ విచారణకు కూడా హాజరయ్యారు. అంతే కాకుండా ఓ సారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేసి వచ్చారు. ఇక రేపు ఆదివారం మరోసారి వెళ్లాల్సి ఉండగా ఇప్పుడు కోర్టు నుంచి మినహాయింపు దక్కింది. దాంతో బన్నీ ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేస్తోంది. రీసెంట్ గానే కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను బన్నీ పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు కేసు పరంగా బన్నీకి ఊరట లభించడంతో.. తిరిగి సినిమాల్లో బిజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.