వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ జరుగుతోంది.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేవలం వైసీపీ శాసన మండలి సభ్యులు మాత్రమే, సభకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సహా, వైసీపీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడంలేదు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అటు శాసన మండలి సభ్యులు, ఇటు శాసన సభ సభ్యులు.. గ్రూప్ ఫొటో దిగారు కూడా. ఈ గ్రూప్ ఫొటోలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ కూడా వుండి వుండాల్సిందన్న చర్చ వైసీపీలోనే జరిగింది. ఓ వివాహ వేడుక, అలాగే ఓ ‘చావు’ పరామర్శ.. ఇలా వేర్వేరు కార్యక్రమాలకి బోల్డంత జన సమూహాన్ని సమకూర్చుకుని హాజరైన వైఎస్ జగన్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, సాధారణ ప్రజానీకంలోనూ చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో, ప్రజలకు సమాధానం చెప్పుకోలేని దుస్థితి ఎదురవుతోంది వైసీపీ శాసన సభ సభ్యులకీ, శాసన మండలి సభ్యులకీ. ‘ఇప్పుడే ఇలా వుంటే, ముందు ముందు నియోజకవర్గాల్లో పరిస్థితులు ఇంకెంత దిగజారుతాయో..’ అని వైసీపీ ప్రజా ప్రతినిథులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా వుంటే, పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో టచ్‌లోకి వెళుతున్నారు. కొందరు ఎమ్మెల్సీలకు టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లే కనిపిస్తోంది కూడా. అలాగే, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో వున్నారని టీడీపీ అంటోంది.
ముందైతే వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్సీలకు స్వాగతం పలికి, ఆ తర్వాత సమయం చూసి ఎమ్మెల్యేలకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందిట. రానున్న రెండు మూడు నెలల్లోనే వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని టీడీపీ ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.