విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత సంబంధిత మొత్తానికి చెక్కుని, స్వయంగా తీసుకెళ్ళడమో.. తమ ప్రతినిధుల ద్వారా పంపడమో చేస్తుంటారు ప్రముఖులు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలువురు ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటించారు. కొందరు, విరాళాల్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు కూడా. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
గతంలో ఎన్నడూ లేని విచిత్రమే ఇది. సరే, ప్రకటించారు.. కానీ, ఎవరికి అందించారు ఆ విరాళాన్ని.? అదైతే ఓ సస్పెన్స్. ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రం ఇవ్వలేదు. పోనీ, పార్టీకి సంబంధించిన ఏదైనా వేదిక ద్వారా ఆ మొత్తాన్ని బాధిత ప్రజలకు అందించే ఏర్పాట్లు చేశారా.? అంటే, ఆ దాఖలాలూ లేవు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వచ్చాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలూ విరాళాలు అందించాయి. ముఖ్యమంత్రిగా అప్పట్లో విరాళాలు ఇవ్వమని జగన్ అభ్యర్థించడమూ చూశాం.
అలాంటప్పుడు, వైఎస్ జగన్ తానే స్వయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ కోటి రూపాయల విరాళాన్ని ఇప్పుడు అందించి వుంటే ఎంత హుందాగా వుండేది.? వచ్చిన ప్రతి అవకాశాన్నీ దుర్వినియోగం చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
‘జగన్ ప్రకటించిన విరాళం.. ఎవరికీ దక్కలేదు. అసలు ఆయన ఇచ్చారో లేదో తెలీదు. ఒకవేళ ఇచ్చినా వైసీపీ నేతలే తినేస్తార్లే..’ అన్న చర్చ వరద బాధితుల్లో జరుగుతోంది.