వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళారు.. వైసీపీకి ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన రవిచంద్రారెడ్డి (స్కైమాక్స్ రవి) రాజీనామా చేశారు. అంతేనా, వైసీపీ సొంత పత్రిక సాక్షిలో టీడీపీ ప్రకటన దర్శనమిచ్చింది. అసలేం జరుగుతోంది వైసీపీలో.!
నిజానికి, సాక్షి పత్రిలో నారా లోకేష్ ఫొటోతోగానీ, చంద్రబాబు ఫొటోతోగానీ టీడీపీ ప్రకటన అనేది వచ్చే అవకాశమే వుండదు. ప్రభుత్వ ప్రకటనలంటే.. అది మళ్ళీ వేరే చర్చ. పార్టీ ప్రకటనల పరంగా చూస్తే, టీడీపీని సాక్షి ఎప్పుడో బ్యాన్ చేసేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే.
కానీ, టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (గతంలో ఈయన వైసీపీ నేతగా పని చేశారు), టీడీపీ ప్రకటనను సాక్షిల్లో ప్రచురించేలా చేయగలిగారు. అదీ ఫుల్ పేజీ ప్రకటన.. అందులో చంద్రబాబు, నారా లోకేష్ హైలైట్ అయ్యారు. కోటి సభ్యత్వాలకు సంబంధించిన ప్రకటన అది.
ఈ ప్రకటన చాలామంది వైసీపీ నేతలకు, కార్యకర్తలకు గుండెపోటు తెప్పించింది. తాము చూస్తున్నది సాక్షి పత్రికేనా.? లేదంటే, ఈనాడు లేదా ఆంధ్ర జ్యోతి పత్రికా.? అని గిల్లి మరీ చూసుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.. సాక్షి పత్రికని చూసి.
‘మీరేమో వ్యాపార అవసరాలు, ఆర్థికావసరాలు చూసుకుంటారా.? మేమేమో పార్టీ కోసం ప్రాణాల్ని సైతం త్యాగం చేయాలా.? మేం, ఆర్థికంగా చితికిపోవాలా.? టీడీపీ, జనసేన పార్టీలకు శతృవుల్లా మారిపోవాలా.? మీరేమో, ఆ పార్టీల ప్రకటనలతో ఆర్థికంగా బలిసిపోతారా.?’ అని ప్రశ్నలు సంధిస్తూ వైసీపీ కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో తమ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్లు పోస్ట్ చేశారు.
వీటిపై స్పందించడానికి వైఎస్ జగన్, అందుబాటులో లేరు.. విదేశాల్లో వున్నారాయన. పోనీ, గతంలో సకల శాఖ మంత్రిగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అందుబాటులో వున్నారా.? అంటే, ఆయనా గత కొంతకాలంగా అండర్ గ్రౌండ్‌లో వున్నట్లే వ్యవహరిస్తున్నారాయె. విజయసాయిరెడ్డి కావొచ్చు, వైవీ సుబ్బారెడ్డి కావొచ్చు.. వీళ్ళెవరూ క్యాడర్‌కి అందుబాటులో లేరాయె.
సరిగ్గా ఈ టైమ్‌లోనే వైసీపీకి రవిచంద్రారెడ్డి రాజీనామా చేశారు. అర్థం పర్థం లేకుండా, మీడియా ముందు వైసీపీ తరఫున నోరు పారేసుకునే స్కైమాక్స్ రవి అలియాస్ రవిచంద్రారెడ్డి, వైసీపీకి రాజీనామా చేయడమేంటో ఎవరికీ అర్థం కాలేదు.
వైసీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డి అయితే, రవిచంద్రారెడ్డి రాజీనామాని తట్టుకోలేక ఓ వీడియో వదిలింది.. అందులో ఆమె ఏడ్చేసినంత పని చేసింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోయినా ఫర్లేదు, పార్టీకి రాజీనామా చేయొద్దంటూ విజ్ఞప్తి చేసేసింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డికి వున్నంత బాధ్యత కూడా వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులకు లేకపోవడం గమనార్హం. అధినేత వైఎస్ జగన్ సంగతి సరే సరి.