ఒకేసారి ఇద్దరు పుడితే ట్విన్స్ అంటారు… ఇలాంటి జననాలు మనం తరచుగా చూసేవే.. ముగ్గురు పుడితే ‘ట్రిప్లెట్స్’ అంటారు. ఇలాంటి ఘటనలు కూడా అరుదుగా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఏకంగా ఒకేసారి ఏడు మంది పుట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా? పోనీ అలా పుట్టిన వారిని ఏమంటారో తెలుసా?. ‘సెప్టిప్లేట్స్’ అంటారు.. ఎప్పుడు ఎక్కడ జరుగుంటుందా? అని ఆలోచిస్తున్నారా ఆ వివరాల్లోకే వెళ్దాం..
అమెరికాలోని కార్లిస్లే అనే పట్టణానికి చెందిన కెన్ని, బాబి దంపతులు 1997లో నవంబర్ 19న ఒకేసారి ఏడు మంది పిల్లలకు జన్మనిచ్చారు. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. ఒకేసారి ఏడు మంది జన్మించిన ఘటనలు ఒకటి అర జరిగినప్పటికీ.. వాళ్ళందరూ ఇప్పటికీ బతికి ఆరోగ్యంగా ఉండడం అసాధారణం అని వైద్యులు చెబుతున్నారు.
కెన్ని, బాబి జంటకి మొదట 1996 లో ఒక పాప పుట్టింది. ఆ తర్వాత సెప్టిప్లేట్స్ జన్మించారు. ఈ ప్రసవం చేయడానికి 40 మంది స్పెషలిస్ట్ వైద్యులు ఏడు నిమిషాల పాటు శ్రమించారు. ఒక్కో బిడ్డ ఒక నిమిషం వ్యవధిలో జన్మించడం విశేషం. వీరిలో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటూ.. ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇలా ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు.