బంగాళాఖతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీ లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతోంది. సోమవారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, నంద్యాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కృష్ణాజిల్లా కృత్తివెన్ను లో 65.75 మీ. లీ వర్షపాతం నమోదయింది.
మరోవైపు ఈనెల 19న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు, బుధవారం కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. గురు, శుక్ర వారాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.