తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతోంది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న ఆ పార్టీ మరింత దారుణ స్థితికి వెళ్లిపోబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో చేరగా.. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారని సమాచారం. రెండు మూడు రోజుల్లో వారి చేరిక కార్యక్రమం జరుగుతుందని అంటున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసే ప్రక్రియ కూడా సాఫీగా జరిగిపోతుందని తెలుస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొత్తం కసరత్తు పూర్తిచేశారని తెలిసింది.
గతేడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 88 చోట్ల గెలుపొందగా.. కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, స్వతంత్రులు 2, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 63 సీట్లు మాత్రమే రావడంతో బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించి తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా చూసుకుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాక్కునే అనైతిక సంప్రదాయం గతంలో కూడా ఉన్నప్పటికీ, కేసీఆర్ ఈ ప్రక్రియను పరాకాష్టకు తీసుకెళ్లారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. రాష్ట్రంలో దాదాపు టీడీపీని అప్పట్లో ఖాళీ చేసేశారు.
సరిగ్గా ఇదే క్రీడను ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అమలు చేశారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని, వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఓ దశలో వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షాన్ని టీడీపీలో విలీనం చేసే లక్ష్యంతో ముందుకెళ్లినప్పటికీ, అది ఫలించలేదు. అయితే, ఈ అంశంలో కేసీఆర్ మాత్రం ఒకడుగు ముందే ఉన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసేశారు. తాజాగా కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేయడానికి రంగం సిద్దం చేశారు.
కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఆ పార్టీని మరో పార్టీలో విలీనం చేయాలంటే మూడింట రెండొంతుల మంది అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంటే 13 మంది సంతకం చేస్తే కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం చేసేయొచ్చు. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలిచిన నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఆ రాజీనామాను వెంటనే ఆమోదించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 18కి తగ్గింది. ఈ నేపథ్యంలో విలీనానికి 12 మంది అంగీకరిస్తే సరిపోతుంది.
ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంతో మరొకరు అవసరం. అయితే, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కారు ఎక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈరోజో, రేపో ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం తథ్యమని అంటున్నారు. ఆయన వస్తే కాంగ్రెస్ విలీనం పూర్తయినట్టే. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే పొడెం వీరయ్య సైతం గులాబీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తమ్మీద ఈ వారంలోనే కాంగ్రెస్ విలీనాన్ని పూర్తిచేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.