ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అదృశ్యమైన యువకుడు పిల్లా సాయి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై కొన్ని వర్గాలు కుల కోణంలో కథనాలు ప్రచురిస్తుండగా, మరోవైపు అతనికి సంబంధించిన క్రిమినల్ రికార్డులు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
విజయవాడలోని కృష్ణలంక రాజీవ్ కాలనీకి చెందిన గద్దె సాయి కృష్ణ అలియాస్ పిల్లా సాయి (25)పై పోలీసు రికార్డుల ప్రకారం మొత్తం 23 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. హత్య, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, దోపిడీలు, గంజాయి అక్రమ రవాణా వంటి పలు తీవ్రమైన నేరాల్లో అతను నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ప్రజా శాంతి భద్రతలకు ముప్పుగా మారిన నేపథ్యంలో 2017లోనే అతనిపై విజయవాడ పోలీసులు రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం పిల్లా సాయి విజయవాడకే పరిమితం కాకుండా గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేర కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతనిపై నమోదైన కేసుల్లో ఒక హత్య కేసుతో పాటు మూడు ఎన్‌డీపీఎస్ కేసులు, నాలుగు దోపిడీ కేసులు, ఐదు దాడి కేసులు, ఒక పోక్సో కేసు, మూడు ఆస్తి నష్టం లేదా దొంగతనం కేసులు, ఒక ఎక్స్‌టార్షన్ కేసు మరియు ఇతర నేరాలు ఉన్నాయి.
మహిళలను వేధించడం, యువతను బెదిరించడం వంటి ఆరోపణలు కూడా అతనిపై నమోదయ్యాయి. గంజాయి మత్తులో తరచూ తిరుగుతూ స్థానికంగా భయాందోళనలు సృష్టించేవాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు కూడా ఇటీవల కాలంలో పెరగడం గమనార్హం. హైదరాబాద్‌తో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ గంజాయి అక్రమ రవాణా కేసుల్లో అతని పేరు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో కూడా పిల్లా సాయి తరచూ వివాదాస్పద పోస్టులు చేసేవాడని తెలుస్తోంది. ఆయుధాలతో ఫొటోలు, బైక్ స్టంట్లు, గంజాయి వినియోగాన్ని ప్రోత్సహించే వీడియోలు పోస్టు చేస్తూ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. తుపాకులు, గొడ్డళ్లు వంటి ఆయుధాలతో దిగిన ఫొటోలు కూడా అతని సోషల్ మీడియా ఖాతాల్లో కనిపించినట్లు చెబుతున్నారు.
ఇటీవల నమోదైన ఓ హత్య కేసులో కూడా పిల్లా సాయి ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి పరారీలో ఉన్నాడని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అతనిపై పలు నాన్-బైలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
అదృశ్యమైన పిల్లా సాయి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అతని ఆచూకీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, అతని అదృశ్యం కేసుతో పాటు గత నేర చరిత్ర కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు, మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమవుతోంది.
