సినిమా క్వాలిటీని పెంచే క్రమంలో.. ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ అందించాలని సినిమా బడ్జెట్ ని రెండు మూడింతలు పెంచేస్తున్నారు మేకర్స్. స్టార్ సినిమా, వందల కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్ ఇది ప్రస్తుతం ప్రతి సినీ పరిశ్రమ అయినా ఫాలో అవుతున్న విధానం. ఐతే ఒకటి హిట్ అయ్యింది కదా అని అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయన్నది చెప్పడం కష్టం. దాని వల్ల ఇండస్ట్రీకి వందల కోట్ల నష్టం వాటిల్లుతుంది.
2024 లెక్కల ప్రకారం తమిళ సినీ పరిశ్రమ దాదాపుగా 1000 కోట్ల దాకా లాస్ అయినట్టు తెలుస్తుంది. తమిళ్ లో స్టార్ సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. కానీ స్టార్ సినిమాల వల్ల భారీ నష్టాలు చూడాల్సి వస్తుంది. ఇక ఇదే క్రమంలో సక్సెస్ ఫుల్ ఇండస్ట్రీ అనుకుంటున్న మలయాళ పరిశ్రమ కూడా 2024లో దాదాపుగా 600 నుంచి 700 కోట్ల దాకా లాస్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా కథ కథనాల కన్నా స్టార్ రెమ్యునరేషన్ ఎక్కువ అవడం.. సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ సెట్స్ మీదకు వెళ్లాక డబుల్ అవ్వడం లాంటి వాటి వల్లే పరిశ్రమ ఇలాంటి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తమిళ, మలయాళ పరిశమలే కాదు తెలుగు, కన్నడ పరిశ్రమలు కూడా భారీ నష్టాలతోనే నడుస్తున్నాయి. కానీ తెలుగులో కొన్ని సినిమాలు పాన్ ఇండియా హిట్ సాధించడం వల్ల నష్టాల గురించి ఎవరు బయటకు చెప్పట్లేదు.
ఐతే తమిళ పరిశ్రమలో స్టార్ సినిమాలు కూడా దెబ్బ వేయడం వల్ల భారీ నష్టాల పాలైంది. మలయాళంలో కూడా 50 కోట్లతో అనుకున్న సినిమాలు కాస్త 100 కోట్లు అంతకుమించి బడ్జెట్ పెట్టడం వల్ల తీవ్ర నష్టాలు చవిచూస్తుంది. అందుకే మలయాళ పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు త్వరలో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.