ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 50వ రోజుకు చేరుకుంది. ఇక 50వ రోజున కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను లోకేష్ విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే అధికారులను ఆదేశించారు. బాధితులకు కావాల్సిన సాయాన్ని కూడా ప్రభుత్వం తరఫున అందించేందుకు హామీలు ఇచ్చారు. ఇక ఈ ప్రజా దర్బార్ లోనే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 15 కుటుంబాలకు చెందిన రూ.200 కోట్ల విలువైన భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి కబ్జా చేశాడంటూ బాధితులు లోకేష్ కు విన్నవించారు.
పట్టణానికి చెందిన బాసాని సునీత, రెడ్డి గోపాలనాయుడు దంపతులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పట్టణంలో రూ.10 కోట్ల విలువైన 50 సెంట్ల భూమిని ఆక్రమించారని.. అడిగితే వేధిస్తున్నారంటూ తెలిపారు. మదనపల్లె లేడీ డాన్ గా పేరున్న కట్టా సులోచన పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించినట్టు వాళ్లు పేర్కొన్నారు. తమ భూమిలో ప్రహరీ గోడను, సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్టు వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే అనుచరులు దాడులకు దిగుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పడంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పంచాయతీ ఏర్పాటు అర్జీతో పాటు టిప్పర్ లారీ యజమానుల సమస్యలపై కూడా అర్జీలు వచ్చాయి. వాటిని పరిష్కరిస్తామని తెలిపారు లోకేష్. ప్రకాశం జిల్లాకు చెందిన చూపు లేని అమ్మాయికి ఉద్యోగ భరోసాను ఇచ్చారు లోకేష్.