ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కూడా ఉండటంతో అధికారులు వారిపై దృష్టి సారించారు. ఆ ట్రైన్లో ప్రయాణించిన వారి వివరాలను వివిధ స్టేషన్ల నుంచి సేకరిస్తున్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న 267 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. వీరిలో 165 మంది విశాఖపట్నానికి చెందినవారు, రాజమండ్రి వాసులు 22 మంది, విజయవాడ కి చెందిన 88 మందిని రైల్వే అధికారులు గుర్తించారు.
మరోవైపు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న 49 మళ్లీ ఏపీ వాసులు క్షేమంగా ఉన్నారు. అయితే, రెండు రైళ్లలో కలిపి 114 మంది ప్రయాణికుల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో వారు ఏమయ్యారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయా లేదా వీరు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులు ఎవరు ఆ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం లేదని తెలిపారు. ఏపి కి చెందిన కొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయని వారికి సహాయక చర్యలు అందించేందుకు ఏపీ మంత్రి అమర్నాథ్ తో సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు ఒడిశా కి వెళ్లారని చెప్పారు.