కొన్నిరోజులుగా దేశంలో మూడు లక్షలకు దిగువనే నమోదవుతున్న కరోనా కేసులతో పరిస్థితి అదుపులోకి వస్తున్నట్టే ఉంది. గడచిన 24 గంటల్లో 17లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,35,532 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 15 నుంచి 13.39కి చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అయితే.. కేరళలో నిన్న ఒక్కరోజే 54,537 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ముందు రోజు 627 మరణాలు సంభవిస్తే.. నిన్న ఒక్కరోజే 871 మంది కరోనాతో మృతి చెందారు. ఇందులో కేరళలోనే 352 మంది, మహారాష్ట్రలో 103 మంది మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజే 3,35,939 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకూ 4,08,58,241 మందికి కరోనా సోకితే.. 3,83,60,710 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ దేశంలో 165 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.