దళితబంధు పథకాన్ని మార్చి 31లోపు ప్రతి నియోజకవర్గంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డిలో ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడారు.
‘ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులను ఎంపిక చేస్తాం. ఇంచార్జి మంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఒకటి లేదా రెండు గ్రామాలను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు పర్యటించి లబ్దిదారులను ఎంపిక, బ్యాంకు అకౌంట్లు తెరవడం చేస్తారు. రెండు నెలలే సమయం ఉండటం వల్ల అధికారులు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేసి.. మార్చి మొదటి వారానికి యూనిట్లను గ్రౌండ్ చేయాలి. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది’.
‘సంగారెడ్డి జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో వంద మందికి చొప్పున నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేశాం. దళితబంధు పథకంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. బడ్జెట్ లో ఈ పథకానికి నిధులు ఎక్కువగా కేటాయించబోతున్నాం. సీఎం కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీని నెరవేరుస్తున్నారు’ అని మంత్రి అన్నారు.