సినీ నటుడు పోసాని కృష్ణమురళికి వైసీపీ ప్రభుత్వంలో ఏదో పదవి దక్కింది.! నామినేటెడ్ పోస్టులేగా.. పంచుకుంటూ పోతున్నారంతే.! ఇంతకీ, ఆయా పదవుల్లో ఆయా వ్యక్తులు రాష్ట్రానికి ఏం వెలగబెడుతున్నట్లు.? ఆ ఒక్కటీ అడక్కూడదు.!
సలహాదారులిచ్చే అర్థం పర్థం లేని సలహాలు.. ఆ సలహాల కారణంగా, అభాసుపాలవుతున్న ప్రభుత్వ నిర్ణయాలు.. కోర్టుల్లో వీగిపోతున్న కేసులు.. వృధా అవుతున్న ప్రజాధనం.! ఇదీ వరస.!
సరే, పోసాని కృష్ణమురళి దగ్గరకు వద్దాం.! నిన్న ఆయన మీడియా ముందుకొచ్చారు. కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు పుట్టినందుకు తాను సిగ్గు పడుతున్నానని పోసాని కృష్ణమురళి సెలవిచ్చారు. అంతే కాదు, కమ్మ సామాజిక వర్గంలో తాను పుట్టినందుకూ సిగ్గు పడుతున్నట్లు పోసాని చెప్పుకొచ్చారు.
ఇక్కడ సామాజిక వర్గాల గోలెందుకు.? ఏ వ్యక్తికీ, తాను ఫలానా కులంలో పుట్టాలనిగానీ.. పుట్టకూడదనిగానీ.. ముందుగానే నిర్ణయించుకునే అవకాశమే లేదు. ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మంచోడైనా, నేరస్తుడైనా.. అది కులాలకతీతమైన వ్యవహారం తప్ప.. ఓ సామాజిక వర్గానికి అంటగట్టడమూ సబబు కాదు.!
‘మా కులపోడు కాబట్టి, మాకు గర్వకారణం’ అనిగానీ, ‘మా కులపోడు కాబట్టి, సిగ్గుపడుతున్నాం’ అనిగానీ.. అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. సినీ నటడు, నిర్మాత, దర్శకుడు.. పైగా, ఇప్పుడేదో ప్రభుత్వ పదవీ వుంది పోసాని కృష్ణమురళికి.
కమ్మ సామాజిక వర్గంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నానని చెప్పడమంటే, ఆ కులాన్ని ఆయన అవమానించినట్లే. వైసీపీలో అందరూ ఇంతే. ‘కమ్మరావతి’ అని వైసీపీ నినదిస్తే, కనీసపాటి జ్ఞానం కూడా లేకుండా, అదే నినాదాన్ని ఎత్తుకున్నారు.. వైసీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలు.
ఔను, పోసాని కృష్ణమురళి సిగ్గు పడుతున్నాడు.. అదీ నిస్సిగ్గుగా.! నీ సిగ్గు తగలెయ్య.!