ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి అలర్ట్ మోగిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 36 ఏళ్ల మహిళ స్క్రబ్ టైఫస్ కారణంగా మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి కొంతకాలంగా జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు చేసిన పరీక్షల్లో ఆమెకు స్క్రబ్ టైఫస్ సోకినట్లు నిర్ధారణ కాగా, పరిస్థితి విషమించి ఆమె మరణించింది. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధిపై భయం పెరిగింది.
స్క్రబ్ టైఫస్ కేసులు అన్ని జిల్లాల్లోనూ పెరుగుతున్నట్టు వైద్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,317 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 379 కేసులు ఉండగా, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడపలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కీటకం కుట్టడం వల్ల వచ్చే ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రారంభ దశలో గుర్తిస్తే సాధారణ యాంటిబయాటిక్స్‌తోనే పూర్తిగా నయం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం, వాంతులు, అలసట, శరీర నొప్పులు వంటి అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరిస్తోంది.
