ఎలిమినేషన్ అవ్వాల్సిన అవినాష్ హౌస్‌లో కొనసాగాడు. ఎలిమినేషన్ షీల్డ్ అవినాష్‌ని కాపాడింది. ఈ పాయింట్ ప్రస్తావించాడు పృధ్వీ, నామినేషన్ ఎపిసోడ్ సందర్భంగా. నబీల్ తనతంట తానుగా అవినాష్‌కి నామినేషన్ షీల్డ్ ఇచ్చాడు. దాంతో, అవినాష్ గట్టెక్కాడు.!
నిజానికి, ఈ ‘షీల్డ్’ అంటే, రక్షణ కవచం.. దీని చుట్టూ ఎవరికీ అర్థం కాని ఓ అయోమయం ఎప్పుడూ వుంటూనే వుంటుంది. ఇది బిగ్ బాస్ ఆడే ఆట మాత్రమే. కంటెస్టెంట్లు జస్ట్ పావులు అంతే.! లేకపోతే, టేస్టీ తేజ – అవినాష్ మధ్య ఎలిమినేషన్ సస్పెన్స్ నెలకొనడమేంటి.? తేజ సేవ్ అవడమేంటి.? అవినాష్ ఎలిమినేట్ అవడమేంటి.? అతనికి షీల్డ్ నబీల్ ముందే ఊహించి ఇవ్వడమేంటి.?
గతంలో కూడా ఈ షీల్డ్ ఇంతకంటే పెద్ద కామెడీ అయిపోయింది. షీల్డ్ అనేది ఓ ఫేక్ వ్యవహారమని తెలిసీ, పృధ్వీ ఆ షీల్డ్ అంశం పట్టుకుని అవినాష్‌ని అవమానించాడు. ‘ఆడియన్స్ నిన్ను హౌస్‌లో వుంచకూడదనుకున్నారు. అందుకే, నిన్ను ఎలిమినేట్ చేశారు. షీల్డ్ వల్ల మాత్రమే హౌస్‌లో వున్నావ్..’ అని పృధ్వీ చెప్పుకొచ్చాడు.
నిజానికి, పృధ్వీ ఎప్పుడో హౌస్‌లోంచి బయటకు వెళ్ళిపోయి వుండాలి. ఓటింగ్ పరంగా చూసుకుంటే, అనధికారిక ఓటింగ్ ప్యాటర్న్స్‌లో ఎక్కడా పృధ్వీ ముందు వరుసలో కనిపించడంలేదు.
కన్నడ బ్యాచ్ అంతా ఒక్కటై, కన్నడ కంటెస్టెంట్ల తరఫున హడావిడి అయితే సోషల్ మీడియాలో చేస్తున్నమాట వాస్తవం. ఇక, అవినాష్ విషయానికొస్తే, ‘జబర్దస్త్’ ద్వారా ప్రతి ఇంటికీ పరిచయమయ్యాడు తెలుగునాట. అలాంటప్పుడు, ఓట్లు పడితే అవినాష్‌కే ఎక్కువ పడి వుండాలి.
సరే, ఎంతమంది బిగ్ బాస్‌ని చూస్తున్నారు.? ఎంతమంది ఓట్లు వేస్తున్నారు.? అన్న విషయాల్ని పక్కన పెడితే, బిగ్ బాస్ అనేది రియాల్టీకి చాలా దూరంగా వుంటోందని నడుస్తున్న ఎలిమినేషన్లను బట్టి అర్థమవుతోంది.
అవినాష్‌ని గతంలో ‘వాడు, వీడు, రేయ్..’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు పృధ్వీ. ఆ తర్వాత కూడా అదే ఆటిట్యూడ్. మామూలుగా అయితే, అవినాష్ తనను తాను సమర్థించుకునేవాడే. కానీ, షీల్డ్ వ్యవహారంతో అవినాష్ గొంతు నొక్కేశాడు బిగ్ బాస్. దాంతో, పృధ్వీకి అవినాష్ అడ్డంగా దొరికిపోయినట్లయ్యింది.